హుజూర్నగర్ : పట్టణంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠా (Bike Thieves Arrest) ను హుజూర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు లక్షల రూపాయల విలువ చేసే ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చరమంద రాజు ( CI Charamanda Raju) వెల్లడించారు.
గురువారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఇద్దరు వ్యక్తులు హెచ్.ఎఫ్ డీలక్స్ బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా, ఎస్సై మోహన్ బాబు తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకుని విచారించగా, దొంగతనాల అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
పోలీసుల విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుంటూరు జిల్లా మేడికొండూరు గ్రామానికి చెందిన షేక్ మాబు , షేక్ రిహాజ్గా గుర్తించామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ , గుంటూరు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. దొంగిలించిన ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.