KCR | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం సిద్దిపేటలో ముగిసింది. బస్సు యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, రోడ్ షోల ద్వారా మెరుగుపడిన పార్టీ విజయవకాశాలు, జాతీయ స్థాయిలో ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.