దుబాయ్: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు(US-Israeli Airstrike) జరిపిన దాడిలో సుమారు 555 మంది మృతిచెందినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ పేర్కొన్నది. శనివారం అకస్మాత్తుగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు .. ఇరాన్‌పై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఆ వైమానిక దాడుల వల్ల ఇరాన్‌లోని సుమారు 131 నగరాల్లో ప్రభావం పడినట్లు ఇరాన్ వెల్డించింది. తమ దేశానికి చెందిన 555 మంది మరణించారని టెలిగ్రాం పోస్టులో ఇరాన్ పేర్కొన్నది.
అయితే పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. కొన్ని దేశాలు అమెరికా-ఇజ్రాయిల్ వైఖరిని ఖండించగా, మరికొన్ని దేశాలు ఆ దాడులను సమర్థించాయి. అయితే కీలకమైన జర్మనీ ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు అండగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇరాన్ తమ దాడుల్ని ఆపకుంటే, అప్పుడు అమెరికా దళాలతో జోడీ కట్టే అవకాశాలు ఉన్నట్లు జర్మనీ వర్గాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ రేడియోతో జర్మనీ సైనిక వర్గాలు ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ వైఖరిని ఖండిస్తూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ గత రాత్రి ప్రకటన జారీ చేశాయి. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు, గల్ప్ మిత్రులను రక్షించుకునేందుకు, అవసరమైతే ఇరాన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆ దేశాలు వార్నింగ్ ఇచ్చాయి.