ఇంద్రవెల్లి, జూలై 28: బడి ఈడు పిల్లలందరూ చదువుకునేలా, పాఠశాలలో చేరేలా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం ఇంద్రవెల్లి మండల పర్యటన సందర్భంగా.. బడిలో చేరని ఇద్దరు చిన్నారులను గుర్తించిన కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులను ఆదేశించడంతో వారికి విద్యాభాగ్యం కలిగింది.
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని సాయినగర్‌లో నివసిస్తున్న కమరే మల్లేష్ పవార్‌కు నలుగురు పిల్లలు. వీరిలో ఇద్దరు మాత్రమే పాఠశాలకు వెళ్తుండగా, మరో ఇద్దరు చిన్నారులు సునీత, సునీల్ తండ్రితో కలిసి వృత్తి పనులు చేస్తున్నారు. బాలకార్మికులుగా ఉన్న ఆ ఇద్దరిని గుర్తించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.. వెంటనే ఈ విషయాన్ని జిల్లా సంక్షేమ అధికారి మిల్కాకు తెలియజేశారు. ఈ ఇద్దరు చిన్నారులు పాఠశాలలో చేరేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ అధికారులు కుటుంబాన్ని కలిసి తల్లిదండ్రులకు చదువు ప్రాధాన్యం వివరించారు. అనంతరం చిన్నారులు సునీతను ఇంద్రవెల్లి జెడ్పీహెచ్ఎస్లో 6వ తరగతిలో, సునీల్‌ను ఎంపీపీఎస్ ఇంద్రవెల్లిలో 5వ తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల కార్మికులు, బడికి దూరమైన పిల్లలు ఉండకూడదనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు.
ప్రతి చిన్నారికి విద్యను అభ్యసించే హక్కు ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఎక్కడైనా బడికి వెళ్లని పిల్లలు లేదా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించి వారి విద్యాభ్యాసానికి, బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.