– అక్రిడిటేషన్ కోసం నాలుగు నెలల నిరీక్షణ
– 20 ఏళ్ల అనుభవం ఉన్నా కార్డు కోసం ఎదురుచూపులే
– అక్రిడిటేషన్ లేక సంక్షేమ ప్రయోజనాలకు దూరం
– సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
కొత్తగూడెం, సెప్టెంబర్ 28 : ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టుల సమస్యే నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలు గడుస్తున్నా కార్డులు మంజూరు కాకపోవడంతో వర్కింగ్ జర్నలిస్టులు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లాలో అనేక సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న పలువురు వర్కింగ్ జర్నలిస్టులు నిబంధనల ప్రకారం ఆన్లైన్లో అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులు సైతం అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రిడిటేషన్ కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదని, దాని ఆధారంగా జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అందాల్సిన పలు సంక్షేమ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని జర్నలిస్టులు తెలిపారు. కార్డుల జారీ ఆలస్యం కారణంగా హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ సదుపాయాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తులపై నెలల తరబడి జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. అర్హత కలిగిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పెండింగ్ ప్రక్రియను పూర్తి చేసి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నా అనంతరం జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ అంకిత్‌ను కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం సమర్పించారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి వెంటనే కార్డులు జారీ చేయాలని కోరారు. జర్నలిస్టుల వినతిపై కలెక్టర్ అంకిత్ స్పందించి సంబంధిత సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులను పిలిపించి అక్రిడిటేషన్ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్డుల మంజూరుకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించినట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ స్పందించడంతో నెలల తరబడి కొనసాగుతున్న అక్రిడిటేషన్ సమస్యపై అధికార యంత్రాంగం దృష్టి సారించిందని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందనే ఆశాభావాన్ని జర్నలిస్టులు వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జర్నలిస్టులు మొగిలిపాక మురళీకృష్ణ, చింతల చిరంజీవి, కొండ జంపన్న పాల్గొన్నారు. ధర్నాకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ యూనియన్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి, 10 టీవీ నాగచంద్ర, కోలా కుమార్‌తో పాటు పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన