All India OBC Meeting : ఆఖిల భారత ఓబీసీ(OBC) మహాసభను జయప్రదం తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల చంద్రశేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆగస్ట్ 7 వ తేదీన నిర్వహించనున్న సభకు ఓబీసీలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. ఈ మీటింగ్కు సంబంధించిన గోడ పత్రికను మంగళవారం హైదరాబాద్ ఎర్రుమంజిల్ లోని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేశబోయిన రమ డిమాండ్ చేశారు.
ఆఖిల భారత ఓబీసీ మహాసభ గోడ పత్రిక ఆవిష్కరణ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు విధించిన క్రిమిలేయర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ (EWS) పేరున అక్రమంగా బీసీ రావాల్సిన ఉద్యోగాలను, బీసీ విద్యార్థులకు దక్కాల్సిన మెడికల్ సీట్స్, ఇంజనీరింగ్ ఐఐటీ సీట్స్ను కొల్లగొట్టుకు పోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమస్యలన్నింటిపై బీసీ ఉద్యోగుల సంఘం పోరాడుతుందని చంద్రశేఖర్ గౌడ్ చెప్పారు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా తమకు చెందాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందని, వీటన్నిటికి పరిష్కారమార్గంగా ఆగస్ట్ 7వ తేదీన జాతీయ బీసీ మహాసభ నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ సభకు బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేశబోయిన రమ మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అలాగే జాతీయ మహాసభలకు తెలంగాణ నుండి బీసీ మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం సలహాదారుడు సుంకరి శ్రీనివాస్, కోశాధికారి శ్రీకాంత్, అసోసియేట్ ప్రెసిడెంట్ వారాల శ్రీనివాస్, రామ రాజు, ఉపాధ్యక్షుడు రాసూరి జ్ఞానేశ్వర్ జగన్, మహేంద్ర సాగర్, షమీమ్ సుల్తానా, మహిళా ఉద్యోగుల సంఘం కార్యదర్శి జ్యోతి శీలం, మంజులత, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.