BRS Party | ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఝరాసంగం గ్రామానికి చెందిన శివప్రసాద్, ఆయన తల్లిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లగా, ఎస్ఐ పాటిల్ క్రాంతికుమార్ ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించారని మండిపడ్డారు. ఐదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి ప్రవేశించి తనపై, తన తల్లిపై దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు. గాయపడిన తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే.. ఫిర్యాదు కూడా తీసుకోకుండా తిరస్కరించారని వాపోయాడు.
ఈ ఘటనను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేషం, మాజీ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, మాజీ సర్పంచ్ జగదీశ్వర్ తదితర నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. బాధితుడి ఫిర్యాదును తిరస్కరించడం సరైంది కాదని విమర్శించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి చట్టప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు అక్కడికి చేరుకుని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. సీఐ హామీతో నాయకులు ఆందోళన విరమించారు.