‘దేవర’ చిత్రంలోని పాపులర్ గీతం ‘చుట్టమల్లే’ వీడియోను కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో మార్ఫింగ్ చేయడం పట్ల అగ్ర హీరో ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసహ్యకరమైన, సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఈ మార్ఫింగ్ వీడియోను సృష్టించిన నీచుల్ని అస్సలు వదిలిపెట్టనని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘స్త్రీలను మాతృమూర్తులుగా, దేవతలుగా పూజించే దేశం మనది. మాతృదేవోభవ అనే మాట మన సంస్కృతిలో భాగమైంది.
అలాంటి గడ్డపై ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఓ స్త్రీని అవమానించడం సిగ్గుచేటు. ఈ వీడియోను సృష్టించిన వారిపైనా, సోషల్‌మీడియాలో వ్యాప్తి చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యల్ని తీసుకుంటాను. దయచేసి ఇలాంటి కంటెట్‌ను ఎవరూ చూడొద్దు. షేర్ చేయవద్దు. ఈరోజు ఓ మహిళకు అవమానం జరిగింది. రేపు మీ ఇంట్లో మీ తల్లి, భార్య, కుమార్తెకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకావొచ్చు. ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలను తీసుకురావాలని భారత ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా’ అని ఎన్టీఆర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.