టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ‘ఆదిత్య 369’ అప్పట్లో సంచలనాలకు వేదికగా నిలిచింది. ఈ అసాధారణమైన కథలో టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, చరిత్ర, భవిష్యత్తు వంటి అంశాలను మేళవించి తెరపై ఓ విజువల్ వండర్‌ను ఆవిష్కరించారు సింగీతం శ్రీనివాస రావు. ఈ సినిమాలో అలనాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్లకుకట్టారు. కథానాయకుడు బాలకృష్ణ కెరీర్లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచింది ‘ఆదిత్య 369’. ఇందులో ఆయన ఆధునిక యువకుడిగా, చక్రవర్తిగా అద్భుత అభినయంతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు.
1994లో వచ్చిన ‘భైరవద్వీపం’ సింగీతం శ్రీనివాస రావు చిత్రాల్లో మరో ఆణిముత్యంగా నిలిచింది. బాలకృష్ణ, రోజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెరపై జానపద ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించింది. రాక్షసులు, మాంత్రిక విద్యలు, సాహసాలు కలబోతగా తెలుగు ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలో ఓలలాడించింది. ఇలా చెప్పుకుంటూ పోతే సింగీతం శ్రీనివాసరావు తన సుదీర్ఘ కెరీర్లో కథాంశాల పరంగా అనేక ప్రయోగాలతో విజయాల్ని అందుకున్నారు. బృందావనం, మేడమ్, మైఖేల్ మదన కామరాజు వంటి చిత్రాల్లో తనదైన శైలి హాస్యాన్ని పండించి ప్రేక్షకుల్ని మెప్పించారు.