భారతీయ సినిమాకు సరికొత్త వ్యాకరణాన్ని పరిచయం చేసి నిరంతర ప్రయోగాలతో దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (94) శనివారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో బాధపడుతున్నారు.
1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆయన జన్మించారు. సుమారు ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 60 చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. విభిన్న జోనర్లలో పలు భారతీయ భాషల్లో సినిమాలు తెరకెక్కించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ప్రయోగాత్మక దర్శకుడిగా కీర్తి పొందారు.
కె.వి.రెడ్డి దగ్గర సినీ ప్రయాణం మొదలు..
కళాశాల రోజుల నుంచే నాటకాలతో పాటు హాలీవుడ్ సినిమాలపై అమితమైన మక్కువ కనబరిచేవారు సింగీతం శ్రీనివాస రావు. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన రాసిన భ్రమ, అంత్యఘట్టం వంటి ప్రయోగాత్మక నాటకాలు పలు అవార్డులు అందుకున్నాయి. అనంతరం కె.వి.రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తూ దర్శకత్వం తాలూకు అనేక విషయాలను అధ్యయనం చేశారు.
‘మాయా బజార్’ వంటి తెలుగు కల్ట్‌క్లాసిక్ సినిమా నిర్మాణాన్ని దగ్గర ఉండి పరిశీలించే అవకాశం పొందారు. కె.వి.రెడ్డి వంటి దిగ్గజ దర్శకుడి దగ్గర మాయాబజార్, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిరస్మరణీయ చిత్రాలకు పనిచేయడంతో భావోద్వేగాలను, హాస్యాన్ని, ఫాంటసీ అంశాలను మేళవించి జనరంజకమైన సినిమాల్ని ఎలా రూపొందించాలో అవగాహన పెంచుకున్నారు సింగీతం శ్రీనివాస రావు. 1972లో ‘నీతి నిజాయితీ’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారాయన. సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ వాణిజ్యపరంగా మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. 1977లో ఆయన తెరకెక్కించిన ‘తరం మారింది’ చిత్రం సామాజిక సమస్యలను చర్చిస్తూ సందేశంతో ఆకట్టుకుంది.
అనంతర కాలంలో ఆయన జమీందారు గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, పంతులమ్మ, గమ్మత్తు గూఢచారులు, పుష్పక విమానం, సుగుణసుందరి, అమావాస్య చంద్రుడు, సొమ్మొకడిది సోకొకడిది, మయూరి, అమెరికా అబ్బాయి, ఆదిత్య 369, బృందావనం, భైరవద్వీపం, మేడమ్ వంటి విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చిత్రాలు కాన్సెప్ట్‌ల పరంగా వేటికవే ప్రత్యేకంగా నిలిచిపోయాయి.
సుధాచంద్రన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన ‘మయూరి’ చిత్రం స్ఫూర్తివంతమైన చిత్రాల్లో ఒకటిగా కీర్తి సంపాదించుకుంది. ప్రమాదంలో కాలు కోల్పోయిన యువతి తన నాట్యాన్ని వదులుకోకుండా తిరిగి జీవితంలో విజేతగా గెలిచిన వైనాన్ని హృదయాల్ని కదిలించేలా హృద్యంగా, చైతన్యపూరితంగా తెరకెక్కించారు సింగీతం శ్రీనివాసరావు. ఈ సినిమా 14 నంది అవార్డులను గెలుచుకొని సంచలనం సృష్టించింది.
1989లో వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ చిత్రం సింగీతం శ్రీనివాసరావు సినీ కెరీర్లో మరో కలికితురాయిగా నిలిచిపోయింది. ఇందులో కథానాయకుడు కమల్‌హాసన్ మరుగుజ్జు పాత్రలో నటించి మెప్పించారు. ఎలాంటి సాంకేతిక వనరులు అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కమల్‌హాసన్‌తో సింగీతం శ్రీనివాస రావు చేసిన ప్రయోగాలు ఆ ఒక్క సినిమాతోనే ఆగలేదు. వారిద్దరి కలయికలో సొమ్మొకడిది సోకొకడిది, రాజా పార్వై, మైఖేల్ మదన కామరాజు, ముంబై ఎక్స్‌ప్రెస్ వంటి ప్రయోగాత్మక చిత్రాలు రూపొందాయి.
కన్నడ సినీరంగంలో సింగీతం శ్రీనివాస రావు తనదైన ముద్రను వేశారు. 1982లో ‘హాలు జేనూ’ చిత్రంతో దర్శకుడిగా కన్నడంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజ్‌కుమార్‌తో కలిసి ఎరడు నక్షత్రగళు, శ్రావణ బంతు, జ్వాలాముఖి, భాగ్యద లక్ష్మీ బారమ్మ, దేవతా మనుష్య వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్‌తో ఆయన చేసిన చిత్రాల్లో నాలుగు తెలుగులో రీమేక్ అయ్యాయి.
2003లో ‘సన్ ఆఫ్ అలాద్దీన్’ అనే చిత్రాన్ని రూపొందించారు సింగీతం శ్రీనివాస రావు. ఈ చిత్రం 2003 ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్ హైదరాబాద్ పోటీ విభాగంలో ప్రత్యేక ప్రశంసను అందుకుంది. 2008లో ‘ఘటోత్కచ్’ పేరుతో ఆయన మరో యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ‘సింగ్ గీతం’ దర్శకుడిగా ఆయన చివరి సినిమా. ప్రముఖ దర్శకుడు నాగ్అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 94 ఏండ్ల వయసులో ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించి సరికొత్త రికార్డు సృష్టించారు సింగీతం శ్రీనివాస రావు. సింగీతం కేవలం దర్శకత్వానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన కథలు, స్క్రీన్‌ప్లే, నాటకాలు రాశారు. ‘భైరవద్వీపం’ వంటి చిత్రానికి పాటలు కూడా రాశారు. తెలుగులో ‘భారతి’ వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతల్ని నిర్వహించారు.
దర్శకుడిగా సింగీతం శ్రీనివాస రావు అసాధారణ ప్రతిభాపాటవాలకు అనేక అవార్డులు వరించాయి. దిక్కట్ర పార్వతి, పుష్పక విమానం జాతీయ చలన చిత్ర పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. మయూరి, బృందావనం, భైరవద్వీపం చిత్రాలు నంది అవార్డులను కైవసం చేసుకున్నాయి. వీటితో పాటు కర్ణాటక రాష్ట్ర చలన చిత్ర పురస్కారాలు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆయన్ని వరించాయి.
సింగీతం శ్రీనివాస రావు తన సినిమాల్లో సామాజిక సమస్యలను చర్చించారు, డైలాగులు లేని మూకీ సినిమా తీసి మెప్పించారు. టైమ్ ట్రావెల్, జానపద కథలు, సంగీత భరిత చిత్రాలతో నిత్యప్రయోగశీలిగా పేరు తెచ్చుకున్నారు. భారతీయ సినిమాను ప్రయోగాల పరంగా కొత్తపుంతలు తొక్కించి నవ్యపథంలో నడిపించిన దార్శనికుడిగా ఆయన పేరు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటుంది.
సింగీతం శ్రీనివాస రావు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ప్రయోగాలే కాదు..సమస్త మానవ భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించి గొప్ప సృజనశీలిగా పేరు తెచ్చుకున్నారు. సింగీతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే చిత్రం ‘పుష్పక విమానం’. 1987లో కమల్‌హాసన్ కథానాయకుడిగా మూకీ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాలో మాటలు లేవు కానీ గొప్ప కథ ఉంది. భావోద్వేగాలున్నాయి. పాత్రలే తమ హావభావాల ద్వారా మాటల్లో చెప్పలేని భావోద్వేగాల్ని పండించాయి.
‘పుష్పక విమానం’ భాషాంతరాలను దాటి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీనికి జాతీయ చలన చిత్ర పురస్కారం కూడా దక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ అత్యంత ప్రయోగాత్మక చిత్రాల్లో ఒకటిగా ‘పుష్పక విమానం’ నిలిచిపోయింది. ఈ సినిమా షాంఘై ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. తరువాత సీఎన్ఎన్-ఐబీఎన్ రూపొందించిన వంద గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు సంపాదించుకుంది.