‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న చిత్రం ‘చంద్రయాన్’. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకుడు. ప్రవీణ్ మొలక నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ జ్యోతీష్యుడు వేణు స్వామి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘ఇది రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. అర్థవంతమైన సినిమా. అమాయకులైన నలుగురు యువకులు రాకెట్ తయారు చేసుకుని స్పేస్‌లోకి వెళ్లడం అనే పాయింట్ ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ఈ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, తెలుసుకున్న విషయాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులకు కొత్త ఫీల్‌ని కలిగించే సినిమా ఇది’ అని చిత్ర సమర్పకుడు వేణు ఊడుగుల అన్నారు. అమాయకులు, ధైర్యవంతులూ అయిన నలుగురు కుర్రాళ్ల కథ ఇదని దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇంకా చిత్ర బృందమంతా మాట్లాడారు.