ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 00:54:45

బాలీవుడ్‌ మొత్తాన్ని నిందించొద్దు

బాలీవుడ్‌ మొత్తాన్ని నిందించొద్దు

బాలీవుడ్‌ చిత్రసీమలో మాదకద్రవ్యాల వినియోగం ఉందని అన్నారు అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌. అయితే ఎవరో కొంతమంది చేస్తున్న చట్టవ్యతిరేకమైన పనులకు హిందీ పరిశ్రమ మొత్తాన్ని నిందించడం తగదని హితవు పలికారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ హీరో సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ ఆత్మహత్య, బాలీవుడ్‌లోని డ్రగ్స్‌ వ్యవహారంపై  అక్షయ్‌కుమార్‌ సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తూ      ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘నా హృదయంలోని ఆవేదనను ఎప్పటి నుంచో మీతో పంచుకోవాలనుకుంటున్నా. ప్రస్తుతం మనమంతా ఓ ప్రతికూల వాతావరణంలో ఉన్నాం కాబట్టి ఎవరితో ఏ విషయాల్ని  షేర్‌ చేసుకోవాలో అర్థం కాలేదు. ప్రజల ప్రేమవల్లే మేము ‘స్టార్స్‌'గా ఎదిగాం. మా ఉన్నతికి ప్రధాన కారణం ప్రజలే. అదేసమయంలో భారతీయ సంస్కృతిని, సామాజిక విలువల్ని  సినిమాల ద్వారా మేము ప్రపంచానికి పరిచయం చేయగలిగాం. వ్యవస్థలోని అవినీతిని, సామాన్య ప్రజల ఆక్రోషాన్ని సినిమారూపంలో సమాజం ముందుంచాం. ప్రజా సమస్యలపై సినిమా కూడా కొంత సామాజిక బాధ్యతతో వ్యవహరించిందని అనుకుంటున్నా. ప్రస్తుతం పరిశ్రమలో చోటుచేసుకున్న పరిణామాలపై సామాన్య ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లుతే వారి మనోస్థితిని అంగీకరించాల్సిందే’ అని అక్షయ్‌కుమార్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ సమస్య గురించి మాట్లాడుతూ ‘ సినీరంగంలోని అపసవ్యపోకడలపై అందరం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోంది.  మిగతా అన్ని రంగాల మాదిరిగానే చిత్రసీమలో కూడా డ్రగ్స్‌ వాడకం ఉంది. అయితే పరిశ్రమలోని అందరిపై నిందలుమోపడం సరికాదు. డ్రగ్స్‌ కేసులో దోషుల్ని న్యాయవ్యవస్థ శిక్షిస్తుంది. దర్యాప్తు సంస్థలకు అందరూ సహకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో చట్టం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది’ అని అక్షయ్‌కుమార్‌ చెప్పారు. logo