శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 17:53:40

జువైనల్‌ హోమ్స్‌లో పిల్లలకు అన్ని వసతులు: మంత్రి సత్యవతిరాథోడ్‌

జువైనల్‌ హోమ్స్‌లో పిల్లలకు అన్ని వసతులు: మంత్రి సత్యవతిరాథోడ్‌

హైదరాబాద్‌:  జువెనైల్ హోమ్స్ లో ఉన్న పిల్లలు ఎవరికీ తీసిపోకుండా వారికి అన్ని వసతులు, పౌష్టికాహారం అందిస్తున్నామని, వారి సమగ్రాభివృద్ధికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జాతీయ బాలల దినోత్సవం, దీపావళి పండగను పురస్కరించుకుని నేడు హైదరాబాద్‌లోని సైదాబాద్ వద్ద గల ప్రభుత్వ జువెనైల్ బాలుర హోమ్స్ లో  ఆమె పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి, బాలల దినోత్సవాలను కొవిడ్ కారణంగా ఘనంగా నిర్వహించుకోలేకపోతున్నామన్నారు. 

పిల్లల మధ్య దీపావళి, బాలల దినోత్సవం జరుపుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ కూడా జైలు జీవితం గడిపారని, అయితే జైలులో ఉన్నంత మాత్రాన కుంగిపోకుండా తమలో ఉన్న శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని బాలురకు సూచించారు. బయట ఉన్నవారికి గల వసతులన్నింటినీ జైలులో కూడా కల్పిస్తున్నామని చెప్పారు. స్పోర్ట్స్ , వృత్తివిద్యా రంగాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. గతంలో ఒకసారి ఇక్కడకు వచ్చినప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రులు తమను చూడ్డానికి రావడం లేదని బాధపడ్డారని గుర్తు  చేసుకున్నారు. కొవిడ్ సమయంలో అనేక సంస్థలు, శాఖలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, అంగన్‌వాడీలు మాత్రం ఈ సమయంలోనే వర్క్ టు హోమ్ పెట్టుకుని నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. తెలిసీ, తెలియక నేరాలు చేసి జువెనైల్ హోమ్‌కు  వచ్చిన వారికి మంచి విద్యను, ఆరోగ్యాన్ని అందిస్తూ వారి భవిష్యత్ తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. ఈ దీపావళి అందరి జివితాల్లో చీకట్లను తొలగించి, వెలుగులు నింపాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ శ్రీమతి దివ్య, జువెనైల్ హోమ్స్ డైరెక్టర్ శ్రీమతి శైలజా, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.