తాండూరు/పరిగి, మే 10 : లోక్‌సభ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని, స్వార్థం కోసం పార్టీలు మారే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తాండూరు పట్టణం, తాండూరు, పెద్దేముల్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆశీర్వాద సభ..అదేవిధంగా పరిగిలోని ఎస్ గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె.. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మహేశ్రెడ్డిలతో కలిసి పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ పాలన తెలంగాణలో స్వర్ణయుగమన్నారు. ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత చేపట్టిన బస్సు యాత్రకు రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో ఓటమి భయం పట్టుకున్న బడేభాయ్, చోటేభాయ్ ఒక్కటై కుట్ర పన్ని కేసీఆర్‌ను రెండు రోజులపాటు మాట్లాడనీయలేదని మండిపడ్డారు. కేసీఆర్ వరంగల్‌లో మాట్లాడితే పరిగిలో ఉన్న ఓ అమ్మ స్పందిస్తున్న దని, కరీంనగర్లో మాట్లాడితే ఇక్కడి రైతు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టి పొరపాటు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. ఆయన్ను మళ్లీ సీఎంగా తెచ్చుకోవాలని, మరోసారి ఎలాంటి పొరపాటు చేయొద్దని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని.. ప్రతి వ్యక్తికీ సంక్షేమ పథకం అందిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని. బీఆర్ఎస్ అధినేత లొల్లి పెట్టడంతోనే రేవంత్ ప్రభుత్వం రైతుబంధు నిధులను వేసిందన్నారు. కానీ..ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లినా దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఝూటా సీఎం రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. మతరాజకీయాలు చేసే బీజేపీ మాటలను నమ్మొద్దన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతినిత్యం పరితపించే బీఆర్ఎస్కే ప్రజలు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని కోరారు. రేవంత్‌రెడ్డి పాలనలో ఆడవారు కనిపిస్తే చాలు బస్సులు స్పీడ్‌గా వెళ్తున్నాయన్నారు.ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీశైల్‌రెడ్డి, బీఆర్ఎస్ నియో జకవర్గ ఎన్నికల ఇన్చార్జి గట్టు రాంచందర్‌రావు, బీఆర్ఎస్ నాయకులు కాసాని వీరేశ్, కొప్పుల అనిల్‌రెడ్డి, నయీం, వీరేందర్‌రెడ్డి, ఆర్.ఆంజనేయులు, ఎంపీపీలు అరవిందరావు, అనురాధ, జడ్పీటీసీలు మంజుల, హరిప్రియ, కోహిర్ శ్రీనివాస్, అశోక్, శ్యాంసుందర్‌రెడ్డి, సురేందర్, రాజేందర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సుభాష్ చందర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సునంద, రామన్నమాదిగ, విజయ్ఆర్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-కాసాని జ్ఞానేశ్వర్, బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి. గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటా. జడ్పీచైర్మన్‌గా, ఎమ్మెల్సీగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేశా. బీసీల సమస్యలపై మంచి అవగాహన ఉన్నది. ఓట్ల కోసం ఎన్నికల్లో మాయమాటలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మొద్దు.
-స్వామిగౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్
రాష్ర్టాభివృద్ధికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చక్కటి విజన్‌తో పనిచేశారు. ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేయాలి. పదవుల కోసం పార్టీలు మారే వెన్నుపోటుదారులకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి. బీసీ, బడుగు, బలహీన వర్గాల నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
-కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే
సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగింది. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందింది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయొద్దు. అమలు కు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐదు నెలల కాలంలో ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదు. రేవంత్‌రెడ్డి పాలన గాడి తప్పింది. ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందిపడుతున్నారు. రైతుబంధు కింద పదకొండు పర్యాయాలు కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని అందించారు. క్వింటాల్ ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటివరకు అమలు చేయలేదు. విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డిలకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.
-పంజుగుల రోహిత్‌రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే
చేవెళ్ల పార్లమెంట్ గడ్డ..బీఆర్ఎస్ అడ్డా. ఈ ప్రాంత ప్రజలకు తెలియని రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను కేసీఆర్ చెప్పారని ఎంపీలుగా గెలిపించుకున్నాం. అయితే వారే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారికి ఓటుతో బుద్ధి చెప్పేందుకు ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి కాసానిని గెలిపించుకోవాలి. వికారాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలను ఓడించేందుకు కుట్ర చేసిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ సునీతారెడ్డికి తగిన గుణపాఠం చెబుతాం. వారు ఎక్కడ నిలబడ్డా రిటర్న్ గిఫ్టు ఇస్తాం. తాండూరు బిడ్డగా ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తా.