Iran vs Israel : ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూఏఈ (UAE), సౌదీ అరేబియా (Saudi Arabia), కువైట్ (Kuwait), బహ్రెయిన్ (Bahrain) దేశాలపైనా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తున్నది. దాంతో ఆయా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారత పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే భారత ప్రభుత్వం వారిని అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తోంది.
ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మందికిపైగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పశ్చిమాసియాలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. గల్ఫ్ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి విమానాల రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించడంతో ఈ నెల 1 నుంచి 7 మధ్యలో 52 వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
వారిలో సుమారు 32 వేల మంది భారత విమానాల్లో స్వదేశానికి చేరుకున్నారని పేర్కొంది. రానున్న రోజుల్లో మరిన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది. విమాన కార్యకలాపాలు ఇంకా అందుబాటులోకి రాని దేశాల్లో ఉన్న భారత పౌరులు స్థానిక రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలని విదేశాంగ శాఖ తన ప్రకటనలో సూచించింది. విదేశాల్లోని భారత పౌరుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో కలసి పనిచేస్తోందని పేర్కొంది.