Ramayana | బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana) ట్రైలర్ విడుదలైనప్పటి నుంచీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో రాణి కైకేయి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి లారా దత్తా (Lara Dutta) తొలి లుక్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. త్రేత యుగంలో సాగిన పురాణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో, లారా దత్తా ధరించిన మోడ్రన్ డిజైనర్ బ్లౌజ్, స్టైలిష్ హెయిర్‌స్టైల్ పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
త్రేత యుగ కాలానికి తగినట్లుగా కాకుండా, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా నీట్‌గా కుట్టిన డిజైనర్ బ్లౌజ్, స్ట్రైట్ హెయిర్, సెలూన్ స్టైల్ హెయిర్‌స్టైల్‌తో లారా కనిపించడంపై విమర్శలు వస్తున్నాయి. త్రేత యుగంలో ప్లెయిన్ రా సిల్క్ చీరలు, హెవీ స్టోన్ ఎంబ్రాయిడరీ, కాంట్రాస్ట్ బ్లౌజ్‌లు ఎవరూ డిజైన్ చేసేవారు? అంటూ కొందరూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక లారా దత్తా లుక్ చూస్తుంటే రామాయణంలా కాకుండా, ఏవో ఏక్తా కపూర్ టీవీ సీరియల్ షూటింగ్లో పాల్గొన్నట్లుగా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. ఇక సినిమా మేకర్స్ తీసుకున్న ఈ సృజనాత్మక స్వేచ్ఛ, కాస్ట్యూమ్ డిజైన్ పై వస్తున్న విమర్శలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!
మహర్షి వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, రవి దూబే, అరుణ్ గోవిల్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2026 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.