Droupadi Murmu : పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తగిన గౌరవం ఇవ్వకుండా అక్కడి మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం అవమానించింది. ఈ విషయంపై స్వయంగా రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడీ అంశం రాజకీయ రంగు పులుముకుంది. టీఎంసీ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ మండిపడుతోంది. మరోవైపు రాష్ట్రపతి పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర హోం శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.
ప్రధానంగా నాలుగు అంశాలపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. 1. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, చీఫ్ సెక్రెటరీ, డీజీపీ ఎందుకు రాలేదు..? 2. రాష్ట్రపతికి వాష్‌రూమ్‌లో నీళ్లు కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు..? 3. రాష్ట్రపతి పర్యటనకు ఎంపిక చేసిన మార్గం మొత్తం చెత్తతో నిండి ఉంది. ఇలాంటి మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు..? 4. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన డార్జిలింగ్ జిల్లా జడ్జి, కమిషనర్ ఆఫ్ పోలీస్, సిలిగురి జిల్లా అడిషనల్ జడ్జిలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? అంటూ ప్రశ్నలు సంధించింది. వీటికి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం బెంగాల్లో పర్యటించారు. సాధారణంగా రాష్ట్రపతి పర్యటనకు వచ్చినప్పుడు సీఎం, చీఫ్ సెక్రెటరీ, మంత్రులు వంటి వారు స్వాగతం పలుకుతారు. కానీ, ద్రౌపది ముర్ము పర్యటనకు వీరు గైర్హాజరయ్యారు. ఆమె పర్యటనలో కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. ఆమె హాజరైన కార్యక్రమానికి ఎంపిక చేసిన స్థలం కూడా చాలా చిన్నది.
దీంతో ఎక్కువ మంది హాజరుకాలేకపోయారు. ఇలాంటి పలు అంశాలపై రాష్ట్రపతి నేరుగా అసహనం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ తనకు చెల్లిలాంటిదని, ఆమె ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలియడం లేదని ద్రౌపది ముర్ము అన్నారు. దీంతో ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం టీఎంసీ ప్రభుత్వంపై మండిపడింది. రాష్ట్రపతిని ఇలా అవమానిస్తారా అంటూ బీజేపీ ప్రశ్నించింది. అయితే, దీనికి మమతా బెనర్జీ స్పందించారు. ఏర్పాట్లు పూర్తి కాలేవని చెప్పినప్పటికీ రాష్ట్రపతి పర్యటన జరిగిందని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని మమత అన్నారు. ఈ విషయంలో బీజేపీ రాజకీయం చేయడం తగదని, దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అవమానించడం సరికాదని మమత అన్నారు.