Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ, అందులో హీరో యశ్, హీరోయిన్ కియారా అద్వానీ మధ్య ఉన్న కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ‘తబాహీ’ పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కియారా అద్వానీపై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివాహం అయ్యాక, తల్లి అయిన తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో నటించడం సరైందేనా అంటూ ప్రశ్నిస్తూ ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్నారు.
కొందరు నెటిజన్లు ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా ఖాతాల్లోకి వెళ్లి కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది.అయితే ఇదే పాటలో నటించిన యశ్‌కు కూడా వివాహం అయ్యి పిల్లలు ఉన్నప్పటికీ, ఆయనపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయకుండా ప్రశంసించడం గమనార్హం. ఈ ద్వంద్వ వైఖరిపై సినీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా స్పందించిన నటి హుమా ఖురేషి, మహిళలను మాత్రమే ఇలా టార్గెట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.ఒక నటిగా పాత్రలో భాగంగా చేసిన సన్నివేశాలను వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి విమర్శించడం చాలా దురదృష్టకరం. మహిళలనే ఇలా వేధించడం అసహ్యంగా ఉంది. ఇలాంటి విమర్శలకు మాటలతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా సినిమానే ప్రేక్షకులకు సరైన సమాధానం చెబుతుంది. ఆగస్టు 26న విడుదలయ్యే ‘టాక్సిక్’ అందరికీ జవాబు ఇస్తుంది అని ఆమె స్పష్టం చేశారు.
హుమా వ్యాఖ్యలకు నటుడు సాకిబ్ సలీమ్ కూడా మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై తీర్పులు ఇవ్వడం ప్రమాదకర ధోరణి అని ఆయన అన్నారు. అలాగే బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా స్పందిస్తూ, “యశ్‌కు పెళ్లై పిల్లలు ఉన్నా ఎవరూ ప్రశ్నించడం లేదు. అదే కియారా విషయంలో మాత్రం విమర్శలు రావడం సమాజంలో ఇంకా ఉన్న లింగ వివక్షకు నిదర్శనం. నటీనటులు పాత్రల్లో జీవించడం వారి వృత్తి. దాన్ని వ్యక్తిగత జీవితంతో కలపడం సరికాదు” అని వ్యాఖ్యానించారు. ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.