న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భారత్ ఇప్పటికే ఫాసిజం అనే అగ్నిపరీక్షలో ఉందా? మన దేశంలో కూడా తీవ్ర జాతీయ వాదం, అధికారం ఒక పార్టీ చేతిలో కేంద్రీకృతం కావడం, ప్రతిపక్షాన్ని అణచివేయడం, మీడియా, ప్రజలపై నియంత్రణ, నిరసనలపై రక్షణ దళాలతో ఉక్కుపాదం మోపడం, జెన్ జీ వర్గాలపై కూడా పాశవిక చర్యలకు పాల్పడటం చూస్తుంటే మన దేశంలో ఫాసిజం అడుగుపెట్టిందన్న అనుమానాలు కలుగుతున్నాయని సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ కే సహాయ్ ‘ద వైర్’ వెబ్సైట్లో అభిప్రాయపడ్డారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు, ఆందోళనల అణచివేతకు ప్రభుత్వం పాల్పడుతున్న నిరంకుశ వైఖరులపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంపై పూర్తి నియంత్రణతో ఒక నాయకుడు లేదా ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను పరిమితం చేయడం, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని అణచివేయాలనే భావజాలాన్నే ఫాసిజం అంటారు. ఇప్పుడు మన దేశంలో ఫాసిజం పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న ఆందోళనను మేధావులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి గర్వంగా నిలిచేలా స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు నిర్వహించి పర్యవేక్షించడానికి రాజ్యాంగం ద్వారా ఏర్పడిన పవిత్రమైన సంస్థే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ). అయితే ఆ ఎన్నికల సంఘానికి ఇప్పుడు కళంకం అంటుకుంది. భారతదేశంలో ఫాసిజం పాతుకుపోయేలా చేసే భారీ యంత్ర పరికరాల తయారీ కర్మాగారంగా మారిందన్న తీవ్ర విమర్శ దానిపై ప్రారంభమైంది.
ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే గళాలను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తున్నది. ఇప్పటికే ప్రధాన మీడియాలో మెజారిటీ భాగాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకున్న ప్రభుత్వం ప్రశ్నించే సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నది. నీట్ అక్రమాలపై ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన జెన్ జీ ఉద్యమాన్ని నిరంకుశంగా అణచివేయడానికి ప్రయత్నించింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విపక్షాలు, ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీలు నిర్వహించిన ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేసింది.
గత 20, 30 ఏండ్లుగా ఎన్నోసార్లు ఓటు వేసిన పౌరుల ఓటు హక్కును ఇటీవల ‘సర్’ పేరిట తొలగించడం ఆశ్చర్యం, షాక్‌నకు గురిచేసింది. ఇదేంటి దశాబ్దాల పాటు ఓటేస్తున్నాం కదా, పేరెందుకు తొలగించారు? అని అడిగిన పౌరులకు సరైన సమాధానం చెప్పే వారే కరువయ్యారు. సర్ పేరిట ఒక వర్గం వారి ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలకు కూడా ఈసీఐ నుంచి సమాధానం లేదు.
బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి అక్రమ వలసదారులను ఏరివేయడానికి ఇది ఎంతో ప్రయోజనకారి అం టున్న కేంద్రం అలా ఎంతమందిని తొలగించారో వివరణ ఇవ్వడం లేదు. ఇటీవల జరిగిన సర్‌లో డూప్లికేట్, మరణించిన వారి ఓటర్లను తొలగించామని చెబుతున్నా.. అలాంటి వారి సంఖ్య రెండు నుంచి ఐదు శాతం మాత్రమేనని డాటా చెబుతున్నది. అంటే మిగిలిన 95 శాతం మంది అర్హులకు అన్యాయంగా ఓటు హక్కు తొలగించినట్టేనా? దీనిపైఏం చెబుతారని పౌరులు ప్రశ్నిస్తున్నారు.