రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్
విద్య అంటే చదువు లేదా అక్షరాస్యత మాత్రమే కాదు. ఆధ్యాత్మిక దృష్టితో గమనిస్తే… ఏది తెలుసుకుంటే తెలుసుకోవలసిన సమస్త విషయాల అంతరార్థం అవగతమవుతుందో దానిని విద్య అన్నారు. దానినే జ్ఞాన సాక్షాత్కార దిశగా జరిగే ప్రయాణం అనవచ్చు. అనుభవ పూర్వకంగా ఇప్పటికే తెలుసుకున్న, ఇక ముందు తెలుసుకోదగిన సకల విద్యలకు తలమానికమైనది రాజవిద్య. నిజానికి యథార్థానుభవ జ్ఞానం కలిగిన వానికి ఇక ముందు తెలుసుకొనవలసినది ఏమీ ఉండకపోవచ్చు. అయితే నిరంతర సాధనాదీప్తమైనది విద్య. తెలిసిన దానినే సాధన చేసే విధానంలో కొత్త కొత్త అనుభూతులను విద్య ప్రసాదిస్తుంది. రాజవిద్య సాధన ఇతర విద్యలను నిరాకరించదు.. వాటిలోని అంతరార్థాన్ని అవగతం చేసుకునే పరమజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
గుహ్యం అంటే రహస్యం. రహస్యం అంటే ఎవరికీ చెప్పకూడదని కాదు. జ్ఞానం దుర్వినియోగం కాకుండా, దాని గాంభీర్యత, పవిత్రతలు పలచబారకుండా, అర్హత ప్రాతిపదికగా బోధించాలి అని అర్థం. జ్ఞానమనేది అత్యంత బలీయమైన శక్తి. అర్హత, నిగ్రహం లేకుండా బోధిస్తే దుర్వినియోగమై సమస్త ప్రజానీకానికి హానికరంగా పరిణమించవచ్చు. అందుకే విచక్షణాయుత సమస్తమైన రహస్య విషయాలకు శిరోభూషణమైనది రాజగుహ్యం. రాజవిద్య, రాజగుహ్యం అంటే అతి పవిత్రమైన సగుణ, నిర్గుణ పరమాత్మ తత్త్వజ్ఞానం. అది ఉత్తమోత్తమమైనది, ప్రత్యక్షఫలదాయకమైనది. అది ధర్మయుక్తం, సాధన చేయడానికి మిక్కిలి సుగమం కూడా. అలాంటి జ్ఞానమే శాశ్వతమైనదని చెబుతున్నాడు, కృష్ణపరమాత్మ.
అర్జునుడు పరమ శ్రద్ధ కలిగిన, దోషదృష్టి లేని భక్తుడు. భక్తి అంటే జీవన గమనంలో అంకితభావనతో కూడిన కర్మాచరణ. అలాంటి ఉత్తమోత్తమ భక్తుడికి అత్యంత రహస్యమైన బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు, పరమాత్మ. ఈ జ్ఞానం పవిత్రమైనది. ఎందుకు? భగవంతుడి ఉపదేశాన్ని శ్రద్ధగా విని నిష్ఠతో ఆచరించేవాడు సమస్త పాపాల నుంచి విముక్తుడై పవిత్రుడు అంటే పాపరహితుడు అవుతున్నాడు. ఏ కర్మనైతే శాస్త్రం నిషేధించినదో దానిని ఆచరించడం పాపం. అజ్ఞానం, ఆసక్తి, అహంకారం, కామనలతో కూడిన కర్మ కూడా బంధానికి కారణంగా మారుతుంది. జ్ఞానం కలిగిన వాడు శాస్త్రవిహిత కర్మలు మాత్రమే నిర్వహిస్తాడు కాబట్టి అతడి అంతఃకరణం పరిశుద్ధమై పాప బంధనాలు పలకరించవు. అందువల్ల ఆ జ్ఞానాన్ని పవిత్రం అన్నారు.
రాజవిద్యా సాధనకు స్వభావవిరుద్ధమైన, కృత్రిమమైన, అసాధారణమైన మార్గాలను అనుసరించవలసిన అవసరం లేదు. నిత్యనైమిత్తిక కర్మలు ఆచరిస్తూనే కర్మఫలాసక్తిని విడనాడటం, భగవంతుడిని స్మరించడం, భక్తితో జీవించడం, తన కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహించడం వీటివల్ల చేసే సాధన సుగమంగా సాగిపోతుంది. నిజానికి ఇవేవి జీవితం నుంచి పారిపోయి చేయాల్సిన సాధనలు కావు. అందువల్ల ‘సుసుఖం కర్తుమ్’ అనగా సాధన శ్రమలేనిదని కాదు… సహజ జీవనానికి విరుద్ధమైన కఠిన ప్రక్రియ కాకుండా, నిత్యజీవితాన్నే సాధనగా మార్చుకోగలిగిన సులభమైన మార్గమని భావించవచ్చు.
అయితే ఆ పరమాత్మ జ్ఞానం సాధనకు సుగమమైనది, ధర్మసమ్మతమైనది, గొప్పనైనది అయినప్పుడు ప్రజలు ఎందుకు దానిని సాధించే ప్రయత్నం చేయడంలేదు? అంటే.. దానికి ప్రబల కారణం అశ్రద్ధే. అది ఎందుకు ఏర్పడుతుంది? బాహ్య ప్రపంచంపై అధిక ఆసక్తి, తక్షణ ఫలితాలపై అలవిమాలిన కోరిక, తపన, ఇంద్రియానుభవాల పట్ల ఆకర్షణ, నేనునాది అనే భావన, పారమార్థిక ప్రయోజనం కన్నా భౌతిక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం ఇవి అశ్రద్ధకు కారణాలుగా భావించవచ్చు. అశ్రద్ధ వల్ల జ్ఞానం పట్ల నిర్లిప్తత కలుగుతుంది. తదుపరి అది జ్ఞానాన్ని తిరస్కరించేందుకు ఉద్యుక్తమవుతుంది. చివరగా జ్ఞానమే అవసరం లేదని భావించే స్థితికి ఎగబాకుతుంది.
అయితే శ్రద్ధ అంటే ఏమిటి? అనే ప్రశ్న వెలుగుచూడవచ్చు. ‘శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః’ అన్న విధానం శ్రద్ధకు నిర్వచనం కాకపోయినా దానిని ఒక క్రమంగా భావించవచ్చు. అందువల్ల శ్రద్ధ అంటే మూఢనమ్మకం కాదు. శ్రద్ధ అంటే విన్నదాన్ని విచారించడం, విచారించినదాన్ని ఆచరించడం, ఆచరించినదాన్ని అనుభవించడం, అనుభవంలో అనుభూతిని చెందడం, సత్యంపట్ల నిష్ఠ కలిగి ఉండటం.
ఆధునిక యాజమాన్య నిర్వహణ కోణంలో దీనిని విశ్లేషణ చేసుకుంటే… రాజవిద్య ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని అందించి విశ్లేషణ చేసే విచారధారగా భావించవచ్చు. జ్ఞానమనేది సంబంధిత రంగంలో అపారమైన సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, అంతరార్థాన్ని గ్రహించడం. విజ్ఞానమనేది జ్ఞాన సేకరణకే పరిమితం కాకుండా దానిని సందర్భానుసారంగా ఆచరణాత్మకంగా వినియోగించుకోవడం. అలాగే నైపుణ్యమనేది తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో అత్యధిక నాణ్యత కలిగిన ఆశించిన ఫలితాలను సాధించే ప్రావీణ్యం.
ఆధునిక యాజమాన్య నిర్వహణలో రాజగుహ్య భావనను అన్వయించుకుంటే, సంస్థలోని సున్నితమైన రహస్యాలను అర్హులతో, అవసరమైన మేరకు మాత్రమే పంచుకుంటూ నిరంతరం కాపాడవలసిన వ్యవస్థ. అయితే ధార్మిక మార్గంలో ప్రజలకు లేదా వినియోగదారులకు న్యాయబద్ధంగా, నాణ్యతా ప్రమాణాలను అనుసరిస్తూ ఉత్పత్తులను అందించడం వల్ల పవిత్రతను సంస్థ కాపాడుకుంటుంది. పవిత్రత అంటే కేవలం ఉత్పత్తి నాణ్యత పెంచడం మాత్రమే కాదు.. ఉత్పత్తి వెనుక ఉన్న ఉద్దేశం, ప్రక్రియ, వ్యవహార విధానం కూడా నైతికంగా ఉండటం. తక్షణ ఫలితాల సాధన లక్ష్యంగా వ్యవస్థను నడిపిస్తూ… అక్రమ మార్గాలను తొక్కకుండా, ధార్మిక మార్గంలో ప్రక్రియ ఆధారంగా వినియోగదారుని ఎదుగుదలను, ఉన్నతిని కోరుకుంటూ ముందుకు నడిచే సంస్థ పరిణత సంస్థగా ఉత్తమమైనదిగా గుర్తింపు పొందుతుంది. ఆ క్రమంలో బ్యాలన్స్ షీట్లో కనిపించే లాభాల కన్నా పరపతి రూపంలో లభించే ఆదరణ సంస్థను ప్రభావశీలిగా నిలపడమే, కాక కాలంతో క్షీణించని సంస్థాగత విలువలను నిర్మిస్తుంది. అయితే ఇలా సంస్థను నడపడం కష్టతరమా అంటే కాదనేది సమాధానం. చిత్తశుద్ధి ఉంటే.. తెల్లవారేసరికే కోటీశ్వరులం కావాలనే అత్యాశకు బానిసలు కాకపోతే అలా నడపడం సుగమమే.
భౌతిక జీవన వికాస సాధన లేదా ఆధ్యాత్మిక జీవన సాధనలోనైనా శ్రద్ధ అత్యంత అవసరం. ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ… వినడం, విచారించడం, ఆచరించడం, అనుభవించడం, అనుభూతి చెందడంగా భావిస్తే సంస్థాగత నిర్వహణలో శ్రద్ధ అనేది సమాచార సేకరణ, దానిని విశ్లేషించడం, త్వరగా సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం, ప్రభావవంతంగా నిర్ణయాలను అమలు చేయడం, ఫలితాలను పరిశీలించడం, అవసరమైన సవరణలు చేయడంగా భావించాలి.