ఏ వయస్సుకా ముచ్చట అన్నారురా! నీకిప్పుడు పదిహేనేళ్లకి తక్కువ లేవు!
జరిగిన కథ: కంచర్ల గోపన్న ఉపనయనం అనంతరం వైష్ణవ దీక్షతో ‘నారాయణదాసు’ అనే దాసనామాన్ని స్వీకరించాడు. సంగీత సాహిత్యాలలో బాగా కృషి చేస్తున్నాడు. అతని నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన తక్కువేమి మనకు... అనే కీర్తన ఆధారంగా చక్రధారి అయిన శ్రీరాముని అవతారాన్ని గురించి, ఆయన భద్రాద్రిలో వెలిసిన వైనాన్ని గురువు నుంచి తెలుసుకున్నాడు.
భక్తరామదాసు, తారకమంత్రము దొరికెను
నాయనా గోపన్నా! మీ నాయన గారు వైకుంఠం చేరుకుని అప్పుడే ఏడేళ్లకు పైమాట. నాకూ ఆయన నుంచి పిలుపు వస్తోంది. రేపో మాపో నేనూ వెళ్లవలసిన దానినే. నేను వెళ్లిపోతే నీ బాగోగులు ఎవరు చూస్తారు చెప్పు” మాట్లాడుతున్న కామాంబ కాసేపు ఆగింది.
గోపన్న అప్పుడే సాయం సంధ్యావందనం పూర్తి చేసుకుని నడవలోకి వచ్చాడు.
“ఈ సమయంలో అలాంటి మాటలెందుకులే అమ్మా!” అన్నాడు యాథాలాపంగా.
“అది కాదు నాయనా! ఏ వయస్సుకా ముచ్చట అన్నారురా! నీకిప్పుడు పదిహేనేళ్లకి తక్కువ లేవు. కొడుక్కి తగిన వయస్సులో పెళ్లిచేసి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని ఏ తల్లి కోరుకోదు చెప్పు. మీ నాయన గారు ఉండివుంటే ఈ పాటికి ఆ ముచ్చట జరిపించేసి ఉండేవారు”
“దానికిప్పుడు తొందరేముందిలే అమ్మా!”
“లేదు గోపన్నా! నువ్వు విద్యావంతుడివి అయ్యావు. తొందరలోనే నీకు తగిన ఉద్యోగం దొరుకుతుంది. అయినా నువ్వు సంపాదిస్తే కానీ, పూట గడవని స్థితి లేదనుకో. కానీ, మాట వరుసకు చెబుతున్నాను. నీకు తొందరగా చక్కని చుక్కలాంటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయాలని నా కోరిక” అన్నది కామాంబ.
గోపన్న ఏమీ మాట్లాడలేదు.
“విస్సన్న మావయ్య గారి కమలాంబను నిన్ను అడగవచ్చారు. ఈ పెళ్లికాస్తా అయిపోతే నీకు నౌఖరీ కూడా మాదన్నతో చెప్పి విస్సన్న మావయ్యే ఇప్పిస్తాడు” చెప్పింది కామాంబ.
“నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత నాతో చెప్పడం ఎందుకులే అమ్మా! నీ ఇష్టమే కానివ్వు” అంటూ తన గది లోనికి వెళ్లిపోయాడు గోపన్న.
సా.శ. 1648 స్వస్తిశ్రీ సర్వధారి నామ సంవత్సరంలో గోపన్నకు – కమలాంబకు పెళ్లి జరిగింది.
పెళ్లి ఎక్కడ జరిపించాలి అనే విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. అక్కన్న మాదన్నలు హైదరాబాదులో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులను తమతోపాటు తీసుకువెళ్లారు. వారితోపాటే అక్కన్న మాదన్నల కడగొట్టు తమ్ముళ్లయిన విశ్వనాథుడు, మురహరి కూడా వెళ్లారు. వారికి కూడా హైదరాబాదులో ఉద్యోగాలు దక్కాయి.
ఆడపెళ్లి వారికి హైదరాబాదులో వివాహం జరిపించడం సౌకర్యంగానే ఉంటుంది. కానీ, పల్లెటూళ్లలో జరిగే పెళ్లికి ఉండే శోభ పట్టణాల్లో కనిపించదు కదా!
“నా కొడుకు పెళ్లి మా ఊళ్లో జరగాల్సిందే” అన్నది కామాంబ.
“అది సంప్రదాయం కాదు కదమ్మా!” అని అన్నదమ్ములు, తండ్రి నచ్చజెప్పబోయారు.
“ఈ పెళ్లిని చూసి ఆనందపడే అదృష్టం మా వారికి ఎలాగూ లేకపోయింది. కనీసం ఈ ఊరిలో అయినా జరిగితే… ఆయన కళ్ల ఎదుటే జరిగినట్లుగా భావిస్తాను” అని పట్టుబట్టింది కామాంబ.
“శ్రావణమాసం లగ్నం అనుకుంటున్నాం. అసలే పల్లెటూళ్లు… బురద బురదగా ఉంటాయి సుమా!” అన్నాడు విస్సన్న.
“అక్కడికి నువ్వేదో నగరంలో పుట్టి, కాలు నేలమీద పెట్టకుండా తిరిగేట్టు మాట్లాడతావేమిరా” అని కసురుకుంది కామాంబ.
పెళ్లికి బంధుజనులంతా వచ్చారు కానీ,
అక్కన్న-మాదన్నలు రాలేదు. కామాంబ మూడో తమ్ముడు విస్సన్న వియ్యంకుడు కానుండగా… ఆఖరువాడైన మురహరి నడుం కట్టుకుని పెళ్లి జరిపించాడు. ఆమె చెల్లెళ్లిద్దరూ తమ పిల్లలతో సహా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
విచిత్రం… పేరుకే శ్రావణమాసం కానీ, ఆ ఏడాది ఒక్క వర్షపు చుక్క పడలేదు. పెళ్లి నిరాటంకంగా, కోలాహలంగా జరిగిపోయింది.
పెళ్లికూతురైన కమలాంబ తన ఎదురుగా పల్లకిలో కూచుని ఉండగా… తనివి తీరా చూసుకుని గోపన్న మురిసిపోయాడు. కొత్త జంటకు ముత్తయిదువలు హారతులు పడుతుంటే కామాంబ కన్నులొత్తుకుంది.

Bhakta Ramadasu 1
* * *
పెళ్లికి అక్కన్న-మాదన్నలు రాకపోవడానికి తగిన కారణం ఉంది. మాదన్న మీర్ జుమ్లా మహమ్మద్ సయ్యద్ వద్ద పేష్కారుగా పని చేస్తున్నాడు. అక్కన్న సైనిక దళంలో ముఖ్యాధికారి. గోల్కొండ పక్షాన మీర్ జుమ్లా బీజాపూరుపై నడిపించిన దాడిలో అక్కన్న ముఖ్యపాత్ర పోషించాడు. అటు తర్వాత ఉదయగిరి, కడప, చెన్నపట్నం, తిరుపతి, చంద్రగిరులు కూడా గోల్కొండ పరమయ్యాయి. చెంగల్పట్టు వద్ద గోల్కొండ సాధించిన విజయంతో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.
మీర్ జుమ్లా దక్షిణాపథంలో ఇన్ని దిగ్విజయ యాత్రలు చేపట్టడం గోల్కొండకు మొదట్లో వరం అనిపించినా… చివరికది శాపంగా తయారైంది. మీర్ జుమ్లా ఈ దండయాత్రల కారణంగా ఆర్థికంగా కూడా లాభపడ్డాడు. అతనిలో కొత్తగా అధికార కాంక్ష బయలుదేరింది. ప్రభుత్వ సైన్యానికి అదనంగా అతను సొంతసైన్యాన్ని కూడా నియమించుకోసాగాడు. గండికోటలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని, స్వతంత్ర పాలకుడిగా వ్యవహరించసాగాడు. గోల్కొండకు వ్యతిరేకంగా తాను బలపడే ప్రయత్నంలో.. అతను సూటిగా ఔరంగజేబుతో సంప్రదింపులు జరుపుతున్నాడు.
ఈ వార్తలన్నీ గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షాకి, మా సాహెబాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. కానీ, వారు మీర్ జుమ్లాను అదుపు చేసే ప్రయత్నాలేవీ చేయలేదు.
ఇటువంటి స్థితిలో… మీర్ జుమ్లా రేప్పొద్దున రాజద్రోహిగా తేలితే… తన ఉద్యోగం ఏమవుతుందనే సందేహం మాదన్నలో బలంగా ఉంది. సయ్యద్ ముజఫర్, మూసాఖాన్లు తనకు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వగలరు. కానీ, మీర్ జుమ్లా వద్ద పనిచేస్తే దక్కే హోదా, గౌరవం మిగిలిన వారి వద్ద పనిచేస్తే దొరకవు కదా!
అది సరే… అసలు తాము గోల్కొండకు రావడానికి ఒకరకంగా ప్రేరకుడు అబుల్ హసన్. అతను చిన్ననాడు నిద్రిస్తుంటే పాము పడగ నీడ పట్టడం చూసి. అతనో చక్రవర్తి కాగలడని మాదన్న నమ్మాడు. కానీ ఆ నమ్మకాన్ని అబుల్ హసన్ పూర్తిగా తారుమారు చేశాడు.
మద్యపానం, స్త్రీవ్యసనం మహమ్మదీయ రాచకుటుంబాలలో సర్వసాధారణం. కాకపోతే అబుల్ హసన్ మోతాదుకు మించి ప్రవర్తించాడు. గౌరవ మర్యాదలు కలిగిన అంతఃపుర స్త్రీలతో సరస సల్లాపాలు సాగించాడు. అది అంతఃపుర మర్యాదలకు భంగకరంగా పరిణమించింది.
సాక్షాత్తూ సుల్తాన్ తమ్ముడి కొడుకే అయినా… అతణ్ని ఎవరూ క్షమించలేదు. అంతఃపురం నుంచి తన్ని తగలేశారు. దేవిడీ మన్నా అయిపోయాక అబుల్ హసన్ అనేకచోట్ల తిరిగాడు. చివరికి సూఫీ గురువైన షారాజు కత్తాల్ వద్దకు చేరుకున్నాడు. రాచభోగాలను మరిచి విరాగిగా, సాధువుగా జీవితం గడుపుతున్నాడు.
అతను మళ్లీ రాజధాని వైపు తొంగిచూసే అవకాశం లేదు. ఇంకా అతను రాజయ్యేదెప్పుడు?! మాదన్నకు మంత్రిపదవి దక్కేదెన్నడు?!
* * *
సర్వధారి నామ సంవత్సరంలో నేలకొండపల్లికి చుట్టుపక్కల ఎక్కడా వానచుక్క లేదు. విరోధి నామ సంవత్సరంలో వర్షాకాలం మొదలయ్యేసరికి క్రమంగా ఆ ప్రాంతాల్లో కరవు ఛాయలు కనిపించాయి.
సంపన్న కుటుంబాల వారు చందాలు పోగుచేశారు. గ్రామంలోని ప్రజలందరి కోసం… ఇతర ప్రాంతాల నుంచి తిండిగింజలు దిగుమతి చేయడం ప్రారంభించారు. నేలకొండపల్లిలోని సంపన్న కుటుంబాల్లో గోపన్న కుటుంబమూ చేరి ఉంది. గోపన్న పెద్ద మొత్తంలో చందా ఇచ్చాడు. ఆ సంవత్సరం మొత్తం ప్రతి నెలలోనూ అందరికంటే ఎక్కువగా చందాలు కడుతూనే ఉన్నాడు.
“కరువు కాలం వస్తే కాకికైనా కష్టమే. కానీ గోపన్నా! ఇలాగైతే ఎలా నాయనా?! నీ దగ్గర నయాపైస లేదంటే రేప్పొద్దున పిల్లనిచ్చిన మామ నీ పెళ్లాన్ని కాపురానికి పంపిస్తాడా? కొంచెం ఖర్చులు తగ్గించుకో” అని కామాంబ ఎంతగానో చెప్పి చూసింది. కానీ గోపన్న వినలేదు.
ఊరు విడిచిపోయే వారికి, గంజినీళ్లకు దిక్కులేనివారికి ఎందరికో విస్తారంగా దానధర్మాలు చేశాడు. ఫలితంగా గోపన్న పిత్రార్జితం కరారావుడి చుట్టేసింది.
“ఇలాగే ఇంకొన్నాళ్లు పోతే, ముష్టిచెంబు పట్టుకుని వీధులవెంట అడుక్కు తినాల్సిందే” విసుక్కుంది కామాంబ.
గోపన్నకు ఇదేమీ పట్టేది కాదు… అతని పాటలేమిటో, తన లోకమేమిటో అన్నట్లు ఉండేవాడు. ఒకనాడు తన గురువైన రఘునాథ భట్టరు వద్ద కూర్చుని ఉండగా, ఆయన ఇలా ప్రసంగించాడు….
“గోపన్నా! నీవు రామభక్తునివి. నీ భక్తి రచనలు ఆనోటా ఈనోటా వింటూనే ఉన్నాను. సంతోషిస్తున్నాను. నీవల్ల కాదగిన మహత్కార్యం ఒకటి ఉన్నందువల్లనే వాణి నీ నోట అలా పలికిస్తోంది. మంచిది. నీ కుటుంబ పరిస్థితి కూడా గమనిస్తున్నాను కదా! ఇప్పుడు నీకు గురువుగా సరైన మార్గదర్శనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నీ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా ఏదైనా మంత్రాన్ని ఉపదేశిస్తాను. శ్రద్ధగా జపించి, తగు ఫలాన్ని శీఘ్రంగా పొందవచ్చు. కోరుకో నాయనా!”
గోపన్న ఒక్కమారు గురువుకు సాష్టాంగపడి లేచాడు.
“గురుదేవా! నాకు తాత్కాలిక సంపదలిచ్చే మంత్రాలేవీ వద్దు. శాశ్వత సుఖాన్నిచ్చే మంత్రమే కావాలి. కొంతకాలంగా రామ సంబంధమైన ఉపనిషత్తులను పఠిస్తున్నాను. తారకమంత్రాన్ని జపించాలని కోరికగా ఉంది. దయచేసి అనుగ్రహించండి” అని దోసిలి ఒగ్గి అడిగాడు.
అతనిలోని రామభక్తికి గురువు సంతోషించాడు. అటుపైన మంత్రదీక్షనిచ్చి… మంత్ర రహస్యార్థాన్ని ఇలా విడమరిచాడు.
“మర్రిపండులో సూక్ష్మాతిసూక్ష్మంగా ఎలాగైతే మర్రిచెట్టు ఇమిడివుందో అదే విధంగా రామబీజమైన ‘రాం’లో ఈ చరాచర జగత్తూ ఇమిడి ఉంది. నమః అనేది జీవాత్మ వాచకం. ఇక రామ అనే పదంలో పరమాత్మ ప్రతిపాదించబడుతున్నాడు. ఆ రాముడితో జీవాత్మకు ఏకత్వాన్ని ప్రతిపాదించడం కోసమే రామ శబ్దాన్ని చతుర్థీ విభక్తి రూపంలో ‘రామాయ’ అని ఉపయోగించాలి.
ఇది రామ షడక్షరీ మంత్రం. దీనినే తారక మంత్రం అంటారు. తనని జపించే వాళ్లని తరింప చేస్తుంది కనుకనే అది తారక మంత్రమయ్యింది. ఈ మంత్రాన్ని చెప్పే సందర్భంలో రామ పూర్వతాపినీ ఉపనిషత్తులో దేవతలు చేసిన రామస్తుతి కనిపిస్తుంది.
కామరూపధారి, మాయామయమైన శరీరం కలిగినవాడు అయిన శ్రీరాముడికి నమస్కారం. వేదాది రూపుడు, ఓంకార స్వరూపుడు అయిన శ్రీరాముడికి నమస్కారం. పరమాత్మమూర్తి అయిన నయనాభిరాముడికి నమస్కారం. జానకీదేవికి అలంకారమైనవాడు, రాక్షసుల్ని సంహరించినవాడు, శుభాకారుడు, దశాస్యుడైన రావణుణ్ని చంపినవాడు, భద్రమూర్తి రఘువీరుడు అయిన శ్రీరాముడికి నమస్కారం చేస్తున్నాము. ఓ రామభద్రా! మహేష్వాసా! రఘువీరా! రాజోత్తమా! దశాస్యాంతకా! మమ్మల్ని కాపాడు. మాకు సంపదల్ని అనుగ్రహించు.
నాయనా గోపన్నా! ఈ మంత్ర సాధనతో ఆ దేవతలు కోరినట్లుగా సంపదలు కలగాలి. అట్టి సంపదలు నిన్ను వరించాలి అని మంగళాశాసనం చేస్తున్నాను” అన్నాడు రఘునాథ భట్టరు.
మరొక్కసారి గురుదేవునికి నమస్కరించి, ఆయన సమక్షంలో కొద్దిసేపు మంత్రసాధన చేశాడు రామదాసు.
ఆరోజుతో ప్రారంభించి, ప్రతిరోజూ నేలకొండపల్లిలోని వైద్యనాథేశ్వరాలయంలో గోపన్న మంత్రసాధన సాగుతోంది. మంత్రం చిన్నది. గోపన్న దీక్ష దొడ్డది. నెలరోజుల కాలంలోనే మొదటి లక్ష మంత్రజపం పూర్తయింది.
ఒక్కసారిగా హృదయం పట్టలేనంత ఆనందం కలిగింది.
తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా
మీరిన కాలుని దూతలపాలిటి
మృత్యువుయని మదినమ్ముక యున్నా
పల్లవి, అనుపల్లవి పూర్తయ్యాయి. అటుపైన చరణాలు పెగల్లేదు. గోపన్న కూడా ఆ విషయం పట్టించుకోలేదు. కన్నులు మూసుకుని అంతర్నిహితుడయ్యాడు.
ఇందాక అతని హృదయం అనుభవించిన ఆనందమనే మేఘం ఒకవేళ గానీ ఆకాశానికి ఎగిరిపోయిందేమో తెలీదు…. అతను పాడిన కీర్తనలోని గంభీరనాదం ఆ మేఘాలను రాపిడి పెట్టిందేమో తెలీదు… జలాజలా చినుకులు రాలిపడ్డాయి.
చూస్తుండగానే చినికి చినికి గాలివానయ్యింది. ఆశ్వయుజ మాసంలో మొదలైన వానలు వికృతి నామ సంవత్సరంలో శ్రీరామనవమి వరకు అడపాదడపా పలకరిస్తూనే వచ్చాయి. కుంటలు, కాలువలు, నదీనదాలు నిండాయి. పంటచేలు కళకళలాడాయి. జనులకు కరవు తీరింది.
(వచ్చేవారం… శ్రీరామనామం మరువాం)
– నేతి సూర్యనారాయణ శర్మ, 99517 48340
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

