భువనేశ్వర్: ఒడిశాలోని నియమగిరి కొండల్లో బాక్సైట్ తవ్వకాలను తిరిగి ప్రారంభించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజన సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. 2013లో 12 గ్రామ సభల్లో ఏకగ్రీవంగా వ్యతిరేకించిన తమ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. కొండలను, తమ జీవన విధానాన్ని కాపాడుకునేందుకు మైనింగ్‌ను వ్యతిరేకిస్తామని గిరిజన ప్రతినిధులు తెలిపారు. 2013లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమగిరి ప్రాంతంలోని ప్రభావిత గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు.
అటవీ హక్కుల చట్టం కింద గిరిజనుల మత, సాంస్కృతిక, సామాజిక హక్కులకు మైనింగ్ వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం గ్రామసభలకు ఇచ్చారు. 2013 జూలై-ఆగస్టులో జరిగిన 12 గ్రామసభలు బాక్సైట్ తవ్వకాలను ఏకగ్రీవంగా తిరస్కరించాయి. దీంతో వేదాంత ప్రతిపాదించిన మైనింగ్ ప్రాజెక్టు నిలిచిపోయింది. కాగా వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల ఒడిశా సీఎంను కలిశారు. నియమగిరి బాక్సైట్ ప్రాజెక్టును పారంభించే అంశంపై చర్చించినట్లు అగర్వాల్ తెలిపారు.