హనుమకొండ, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఐనవోలు : నిషేధిత భూ ముల నిబంధనల పేరిట పేద, మధ్యతరగతి వర్గాలను అవస్థలు పెడుతున్న ప్రభుత్వం.. అధికార పార్టీ వారికి అడ్డగోలుగా కట్టబెడుతున్నది. నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అధికారులు మొరం తవ్వకాల కోసం అనుమతులు ఇచ్చి అక్రమాలకు అండగా నిలుస్తున్నారు.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి శివారు (మంగళి దుబ్బ) 1279లో సర్వే నంబర్లోని 63.30 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం 70 మంది పేదలకు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పీవోటీ యాక్ట్-1977 కింద భూభారతి పోర్టల్‌లో పెట్టిన నిషేధిత జాబితా (22ఏ)లో తహసీల్దార్, కలెక్టర్ సంతకాలతో ఈ భూములు ఉన్నాయి. ఈ భూముల్లోనే 788 టన్నుల మొరం తవ్వి తరలించేందుకు మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చింది.
హనుమకొండ జిల్లా మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ మేరకు సెప్టెంబర్ 28న అనుమతులు జారీ చేశారు. నిషేధిత భూముల వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా అయోమయ పరిస్థితి నెలకొన్న తరుణంలో మైనింగ్ శాఖ వివాదాస్పద అనుమతులు ఇవ్వడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల మేరకు భూమి ఒకరిపై ఉంటే.. మైనింగ్ శాఖ మరొకరి పేరుతో అనుమతి ఇచ్చింది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి ఆదేశాలతోనే ఈ వివాదాస్పద అనుమతులు జారీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
కొండపర్తిలోని నిషేధిత జాబితా (22ఏ)లో నమోదైన 1279/2 సర్వే నంబర్లోని 152 హెక్టార్లలో 788 టన్నుల మొరాన్ని సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 17 వరకు తవ్వుకొని తరలించేందుకు మైనింగ్ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో వేరే గ్రామానికి చెందిన వ్యక్తి పేరు ఉన్నది.
రెవెన్యూ రికార్డుకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్ భూభారతిలో 1279/2 అసైన్డ్ భూమి కావడంతో నిషేధిత జాబితాలో కొండపర్తికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఇదే సర్వే నంబర్‌పై సమీపంలోని గర్మిళ్లపల్లికి చెందిన మరో వ్యక్తి పేరుతో మైనింగ్ శాఖ అధికారులు మొరం తవ్వకానికి అనుమతులు ఇచ్చారు. మైనింగ్ శాఖ అధికారులు పర్మిట్ ఇచ్చే ముందు రెవెన్యూ అధికారుల నుంచి భూ యజమాని వివరాలు, భూమి స్వభావం, నిషేధిత జాబితా వంటి అంశాలను పరిశీలించకపోవడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రెవెన్యూ శాఖ ధ్రువీకరణతో సంబంధం లేకుండానే మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చిందా? ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు రెండు శాఖలు ఉద్దేశపూర్వంగానే ఇలా చేశాయా? అనే చర్చ సాగుతున్నది. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంలో భారీ అవినీతి జరిగిందనే అనుమానాలకు తావిస్తున్నది.
వరంగల్ నగరానికి సమీప ప్రాంతం కావడంతో మొరం కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటున్నది. మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతితో ఈ సమీపంలోని మొత్తం భూముల్లో మొరం తవ్వకాలు జరిపేందుకు అధికార పార్టీలోని పలుకుబడి ఉన్న వారు ప్రణాళిక సిద్ధం చేశారు.
అనుమతులు కొంత భూమికే అయినా అక్కడ ఉన్న మొత్తం అసైన్డ్ భూముల్లోనూ మొరం తవ్వేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం టిప్పర్ మొరానికి రూ.8 వేల నుంచి రూ.10వేల ధర పలుకుతున్నది. ఒక టిప్పర్‌లో గరిష్ఠంగా ఆరు టన్నుల మొరం పడుతుంది. మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతిలో మొరం తవ్వుకొని అమ్ముకునే వారు ప్రభుత్వానికి టన్నుకు రూ.26 రాయల్టీగా చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
కోట్ల రూపాయల మొరం తవ్వకానికి అనుమతి ఇచ్చి నామమాత్రంగా రాయల్టీ నిర్ణయించడంలో మతలబు ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిత భూముల్లో అక్రమంగా మొరం తవ్వకాలకు అనుమతి ఇవ్వడంపై చర్యలు తీసుకోవాలని, అధికార పార్టీ నాయకుల దందా నుంచి అసైన్డ్ భూములను రక్షించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.