హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, అక్రమాలు, భూదందాపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ చేసిన సంచలన ఆరోపణలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. రూ.50 వేల కోట్ల భూ దందాను ఆయన బయటపెట్టడం సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై అధికార పార్టీ నేతలెవరూ స్పందించడం లేదు. కనీసం ఆరోపణలేనని కొట్టిపారేయకపోవడం, పత్రికా ముఖంగా ఖండిచకపోవడం గమనార్హం.
సీఎంను ఏదైనా అంటే కస్సున లేచే ఆయన వర్గం ఈ విషయంలో పూర్తిగా సైలెంట్ అయ్యింది. సీఎం వెన్నంటి తిరిగే వారు కూడా ప్రతిస్పందించలేదు. మాక్స్‌బీన్ ఫార్మా, మెడికవర్, గీత ఆటోమోటివ్స్, ఇంటర్నేషనల్ సూల్స్ పేరిట భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు రూ.50 వేల కోట్ల మేర దోపిడీ జరిగిందని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు. ప్రతిదానికీ ఒంటికాలిపై లేచే సీఎం రేవంత్‌రెడ్డి కూడా మౌనం వహించారు. ‘రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా’నంటూ చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం కనీసం ఇంటి నుంచి బయటికి కూడా రాలేదు.
ఈ వ్యవహారంపై తన సన్నిహితులతో ఆరా తీసిన ట్టు ప్రచారం జరుగుతున్నది. తమ కుటుం బ అక్రమ ఆస్తుల వివరాలు బయటికెలా వెళ్లాయంటూ ప్రశ్నించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇక ఇదే విషయంపై ఇంటెలిజెన్స్ విభాగం సైతం సీఎం కు ఓ నివేదిక సమర్పించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో తీవ్ర డ్యామేజీ జరిగిందని.. బదనాం అవుతున్నారని.. అప్రతిష్ట మూటగట్టుకున్నారని నివేదించినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తున్నది.
క్రిశాంక్ ఆధారాలతో బయపెట్టడం, మొత్తం బండారం బట్టబయలు కావడంతో సీఎం వర్గం ఆత్మరక్షణలో పడ్డట్టు సమాచారం. తాను చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని మన్నె క్రిశాంక్ ప్రకటించారు. కానీ 24 గంటలు గడిచినా కాంగ్రెస్ నేతలెవరూ ముందుకు రాలేదు. సాధారణంగా చిన్నపాటి విమర్శలకే సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు అతిగా స్పందిస్తుంటారు. ఈ ఆరోపణలపై ఎస్ఎంలోనూ మౌనంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై ఏం చేయాలనే పరిస్థితిని సీఎం వర్గం ఎదుర్కొంటున్నట్టు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా రేవంత్ అసమ్మతి వర్గం ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకుంటున్నది. పత్రికల్లో ఫొటోలతో ప్రచురితం కాగా, వీటన్నింటినీ జోడించి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. మరికొన్ని భూదందాల గురించీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రూ.50 వేల కోట్ల స్కామ్‌పై ఆరా తీసినట్టు ఆ పార్టీ నేతలల్లోనే ప్రచారం జరుగుతున్నది. ఈ దందా ఎలా జరిగింది? ఎవరెవరి పాత్ర ఏమిటన్న దానిపై ఆరా తీసినట్టు విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. సోమవారం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనను ఇదే విషయంపై అధిష్ఠానం ఆరా తీసే అవకాశం ఉన్నదనే చర్చ నడుస్తున్నది.