అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘సిట్’. ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ అనేది ఉపశీర్షిక. నటాషా దోషి కథానాయిక. విజయభాస్కర్‌రెడ్డి(వీబీఆర్) దర్శకుడు. నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్‌రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ట్రైలర్‌ని యువహీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా బావుందని చిత్రబృందాన్ని ఆయన అభినందించారు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంతో కూడిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ట్రైలర్ చెబుతున్నది. అరవింద్‌కృష్ణ ఇందులో శక్తివంతమైన పోలీస్అధికారిగా, రజత్రాఘవ కీలకపాత్రలో నటిస్తున్నారని, ఉత్కంఠను రేకెత్తించే కథాకథనాలతో సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. రుచిత సాదినేని, అనిల్ రాథోడ్, కౌశిక్ మేకల తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: వరికుప్పల యాదగిరి.