వేసవి ప్రారంభమైంది. ఈ కాలంలోనే నిమ్మపండ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పెరటి తోటలోని నిమ్మచెట్టు పుష్కలంగా కాయలు కాయాలంటే.. సరైన పోషణ, సంరక్షణ ముఖ్యం. అంతేకాకుండా, మార్చిలో ఎండల తీవ్రత పెరుగుతుంది కాబట్టి, నిమ్మచెట్టుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. కాయలు రాలకుండా.. మంచి దిగుబడి రావాలంటే, ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి.
మార్చిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి, భూమిలో తేమ ఆరిపోకుండా చూసుకోవాలి. నేల పూర్తిగా ఎండిపోకముందే నీరు పెట్టాలి. అయితే, మరీ ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఉదయం ఎండ రాకముందు, సాయంత్రం ఎండ తగ్గిన తర్వాతే నీరు పెట్టడం మంచిది. దీనివల్ల వేర్లు చల్లగా ఉంటాయి. ఎండదెబ్బ నుంచి వేర్లను కాపాడటానికి మొక్కల మొదళ్ల దగ్గర మల్చింగ్ చేయడం మంచిది. చెట్టు మొదలు చుట్టూ ఎండుగడ్డి, ఎండిన ఆకులు, కొబ్బరి పీచుతో 3-4 అంగుళాల మేర కప్పితే.. వేర్లు దెబ్బతినకుండా ఉంటాయి. నేలలో తేమ ఎక్కువ సేపు ఉంటుంది కూడా. నేలకు తగిలేలా ఉండే కింది కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది. ఇక నిమ్మలో పూత రాలకుండా ఉండటానికి, కాయల పరిమాణం పెరగడానికి.. ఒక లీటర్ నీటిలో 2గ్రా. బోరాన్, 5గ్రా. జింక్ సల్ఫేట్ను కలిపి పిచికారీ చేయాలి. ఇంట్లో మిగిలిన పుల్లని పెరుగుతో మజ్జిగ చేసి, నిమ్మచెట్టు మొదట్లో పోయాలి. చెట్టుపై పిచికారీ చేసినా.. శిలీంధ్ర తెగుళ్లు తగ్గుతాయి.