Asish Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ డా.ఆశిష్ బెనర్జీ (74) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది కూడా టీఎంసీ పార్టీ ఆఫీసులోనే. ఆత్మహత్య చేసుకున్న చోటు నుంచి పోలీసులు ఒక సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఆశిష్ బెనర్జీ ఆదివారం ఉదయం రాంపూర్హత్ పట్టణంలోని తన ఇంటికి సమీపంలోనే ఉన్న టీఎంసీ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆధారాల్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఒక సూసైడ్ నోట్ లభించింది.
ఈ లేఖలో తాను అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నాడు. రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన తప్పు అని వివరించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కూడా లేఖలో రాశారు. ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. టెండర్లలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తారాపీఠ్-రాంపూర్హత్ డెవలప్మెంట్ అథారిటీ (టీఆర్డీయే)కు సంబంధించి ఇటీవల పలు అక్రమాలు వెలుగు చూశాయి. టెండర్లు, చెక్కులు, ఎన్వోసీలు సహా పలు అంశాల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. వీటికి ఆశిష్ బెనర్జీని బాధ్యుడిని చేస్తూ విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై తన సూసైడ్ లేఖలో ఆశిష్ బెనర్జీ పేర్కొన్నారు. తాను ఏ పనులకూ డబ్బు డిమాండ్ చేయలేదని, టీఆర్డీయేకు సంబంధించిన అవినీతికి, తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు.
విద్యార్థి దశ నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని వివరించాడు. అసలు, తాను రాజకీయాల్లోకి రావడమే తప్పు అని భావిస్తున్నట్లు లేఖలో రాశాడు. పార్టీలో తప్పుల్ని తాను ప్రోత్సహించలేదని, ఇదే సమయంలో అక్రమాలకు పాల్పడుతున్నవారిని ఎదిరించలేకపోయానని కూడ వివరించారు. ప్రస్తుతం అతడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. లేఖలోని అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లా, రాంపూర్హత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆశిష్ బెనర్జీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2001 నుంచి 2026 వరకు వరుసగా ఐదుసార్లు బిర్భూమ్ జిల్లాలోని రాంపూర్హట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు.
పాతికేళ్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గానే కాకుండా మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.