Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో 18వ రోజు ఆసక్తికర పరిణామాలతో సాగింది. ఇప్పటికే కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు ‘అగ్ని పరీక్ష’ నుంచి వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్లతో బిగ్ బాస్ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈ ముగ్గురిలో ఒకరికి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రకటించడంతో హౌస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ముందుగా కెప్టెన్సీ కంటెండర్ టాస్కులు కొనసాగాయి. ఈ క్రమంలో బజర్ ఎవరు ముందుగా మోగించారనే విషయంలో త్రిగుణ్ సంచాలక్‌గా వ్యవహరించాడు. వంశీ, నరేష్ మధ్య జరిగిన పోటీలో మొదట నరేష్ బజర్ కొట్టినట్లు త్రిగుణ్ ప్రకటించాడు. అయితే కొద్దిసేపటి తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని వంశీ ముందుగా బజర్ మోగించాడని చెప్పాడు.
తాను గందరగోళానికి గురయ్యానని, నిర్ణయం విషయంలో తప్పు జరిగిందని త్రిగుణ్ అంగీకరించాడు. బిగ్ బాస్ ఎలాంటి శిక్ష విధించినా స్వీకరిస్తానని చెప్పినప్పటికీ.. బజర్ మాత్రం వంశీనే ముందుగా మోగించాడని స్పష్టం చేశాడు. ఈ వ్యవహారంతో నరేష్ అసంతృప్తికి గురై త్రిగుణ్‌తో వాగ్వాదానికి దిగాడు. మరోవైపు మరో బజర్ రౌండ్లో ఝాన్సీ ముందుగా బజర్ మోగించడంతో వంశీ, ఝాన్సీ మధ్య కెప్టెన్సీ పోటీ కొనసాగింది. చివరకు ఝాన్సీ విజయం సాధించింది. దీంతో ముఖేష్, అమన్, సృష్టి, ఝాన్సీ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఆ తర్వాత హౌస్ సభ్యుల ఆటతీరుపై బయట నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలను బిగ్ బాస్ టీవీలో ప్రదర్శించారు. ముఖేష్ గురించి వచ్చిన వ్యాఖ్యల్లో అతను వర్షిణితో ఎక్కువగా ఉంటూ ఆటపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం లేదని, ఇతర సభ్యులతో పెద్దగా కలవడం లేదని పేర్కొన్నారు.
అదే సమయంలో షాలిని ఆటతీరుపైనా విమర్శలు వినిపించాయి. ఆమె మాటలు జారుతున్నాయని, ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా గెలవలేదని కామెంట్లు వచ్చాయి. రామ్ ప్రసాద్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడనే వ్యాఖ్య కూడా కనిపించింది. వర్షిణి విషయంలో మాత్రం ఆట కంటే హంగామా ఎక్కువగా ఉందని, ముఖేష్ తప్పు చేసినా అతనికి గుడ్డిగా మద్దతు ఇస్తోందనే వ్యాఖ్య వచ్చింది. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకుని హౌస్ సభ్యులు ఆశ్చర్యపోయారు. ‘అగ్ని పరీక్ష’లో పాల్గొన్న మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ ఈ కామెంట్లు చేసినట్లు బిగ్ బాస్ వెల్లడించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ ముగ్గురూ బిగ్ బాస్ ఇంటి గేటు వద్దకు వచ్చారు. వారిలో ఒక్కరికి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే ఆ ముగ్గురిలో ఎవరిని హౌస్‌లోకి పంపించాలనేది బయట నుంచి బిగ్ బాస్ నిర్ణయించకుండా.. ఇప్పటికే ఇంట్లో ఉన్న సభ్యులే నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు.
మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ తమను తాము హౌస్ సభ్యులకు పరిచయం చేసుకున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి అవకాశం వస్తే తమ ఆట ఎలా ఉంటుందో వివరించారు. ఈ సందర్భంగా మిథిలేష్ తన వ్యాఖ్యలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ముఖేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్ గురించి వచ్చిన కామెంట్లను తానే చేశానని చెప్పాడు.ముఖ్యంగా త్రిగుణ్ ఆటతీరుపై మిథిలేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అతను పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడంటూ విమర్శించాడు. దీంతో హౌస్‌లో ఉన్న సభ్యులకు కొత్త కంటెస్టెంట్‌గా మిథిలేష్ వస్తే పరిస్థితులు ఎలా మారుతాయనే ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరికి హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కుతుందన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. బిగ్ బాస్ నిర్ణయం ప్రకారం తుది ఎంపికను హౌస్ సభ్యులే చేయాల్సి ఉండటంతో.. వారి ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో ఈ ముగ్గురిలో అసలు వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరిదో తేలనుంది.