Sai Dharam Tej | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ చేసిన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 2021 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా తేజ్ ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పిందని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.ప్రమాదం తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న సాయి ధరమ్ తేజ్ క్రమంగా కోలుకుని తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. తన ప్రమాదం నుంచి తాను నేర్చుకున్న విషయాన్ని చెబుతూ.. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన తరచూ సూచిస్తుంటారు.
ప్రమాదానికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా తేజ్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఆ రోజు తనకు జీవితంలో రెండో అవకాశం లభించిందని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, సినీ ప్రేక్షకులు చేసిన ప్రార్థనలు, అందించిన ప్రేమ తనకు ఎంతో బలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత తాను దాదాపు 90 శాతం కోలుకున్నానని, మాట విషయంలోనూ, మరికొన్ని విషయాల్లోనూ ఇంకా సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ నెమ్మదిగా ముందుకు సాగుతున్నానని తెలిపారు.ఇక తన పోస్టులో ప్రధానంగా హెల్మెట్ ప్రాధాన్యతను ప్రస్తావించారు. అయితే ఈ పోస్టుపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్‌కు సహాయం చేసిన సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్‌ను ప్రస్తావించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫర్హాన్ అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో పాటు తేజ్‌ను ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తేజ్ కోలుకున్న తర్వాత ఫర్హాన్‌ను పట్టించుకోలేదంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
ఈ విమర్శలపై సాయి ధరమ్ తేజ్ స్వయంగా స్పందించారు. ఫర్హాన్‌కు తాను ఇప్పటికే ఆర్థికంగా సహాయం చేశానని స్పష్టం చేశారు. కుటుంబ బాధ్యతలు ఉన్నందున ఉద్యోగంపై దృష్టి పెట్టేందుకు తనను మరే విధంగానూ ఇబ్బంది పెట్టవద్దని ఫర్హాన్ కోరినట్లు తెలిపారు. అందుకే ఐదేళ్ల తర్వాత చేసిన తన తాజా పోస్టులో ఫర్హాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదని వివరించారు.ప్రమాదం తర్వాత స్పృహలోకి వచ్చిన అనంతరం తాను చేసిన తొలి వీడియోలోనే తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపినట్లు తేజ్ పేర్కొన్నారు. వైద్యులు, అంబులెన్స్ సిబ్బంది, తనకు అండగా నిలిచిన ఇతరులందరికీ అప్పుడే ధన్యవాదాలు చెప్పానని వివరించారు.అంతేకాదు.. ఫర్హాన్‌కు ఆర్థిక సహాయం చేయడంతో పాటు అతన్ని, అతని తండ్రిని సన్మానించినట్లు మరో పోస్టులో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ప్రమాద సమయంలో తనకు సహాయం చేసిన వ్యక్తిని తాను మరిచిపోలేదని తేజ్ స్పష్టం చేసినట్లైంది.
ఇక తనను విమర్శించిన వారిపైనా తేజ్ సానుకూలంగానే స్పందించారు. తనకు వివిధ రూపాల్లో ప్రేమను చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ.. తనపై వస్తున్న విమర్శలను కూడా స్వీకరిస్తున్నాననే భావనలో స్పందించారు. ఈ పరిణామంతో సాయి ధరమ్ తేజ్ ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదం, ఆ సమయంలో తనకు సహాయం చేసిన వ్యక్తికి అందించిన సాయం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
I have financially helped him and felicitated his father and him, I really hope you’re satisfied with this one. Thank you Nikhil ☺️ https://t.co/EcgKgKA9YZ pic.twitter.com/ytjBRFCQPR
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 24, 2026
To all of those who are mentioning about #Syedabdulfarhan I have already helped him financially and also he requested that he not be disturbed by any other way so that he can focus on his job as he’s got family responsibilities and so this time my message today was to all the… https://t.co/CoWNm9sXCt
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 24, 2026