రాంచి: జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని విద్యార్థి నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆగస్ట్ 20న సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని ముట్టడిస్తామని వారు స్పష్టం చేశారు. (Jharkhand Protests) జార్ఖండ్లో నిర్వహించిన నియామక పరీక్షలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న విద్యార్థులు గత 22 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. శనివారం దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాంచిలో ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించారు. తమ డిమాండ్లపై స్పందించని సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘ఆగస్ట్ 20న ముఖ్యమంత్రి నివాసాన్ని మేం ముట్టడిస్తాం. జేఎంఎం, కాంగ్రెస్ రెండూ మాతో రాజకీయాలు చేస్తున్నందున ఆయన రాజీనామాను మేం కోరుతున్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి మా మాట వినకపోతే, జేఎంఎం నేతృత్వంలోని కూటమికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం’ అని జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ రిఫార్మ్స్ మంచ్ నాయకుడు రవీంద్ర పాశ్వాన్ అన్నారు.
కాగా, ఆదివారం 24 జిల్లాలంతటా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని నిరసనకారులు తెలిపారు. అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్న పరీక్షలను రద్దు చేయడం, నియామక ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరుపడం వంటి తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరసనను విరమించబోమని వారు స్పష్టం చేశారు.