స్క్రీన్ వైపు చూడటం పాత పద్ధతి.. ఏఐతో మాట్లాడటం, చూడటం ఇప్పుడో కొత్త శకం! అందుకేనేమో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసించిన ఆపిల్.. ఇప్పుడు తన దృష్టిని పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పైకి మళ్లించింది. కేవలం ఐఫోన్ సాఫ్ట్‌వేర్‌లోనే కాకుండా.. మన దైనందిన జీవితాన్ని మార్చేసే మూడు సరికొత్త ఏఐ గ్యాడ్జెట్స్‌ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు లేటెస్ట్ లీక్స్ ద్వారా వెల్లడైంది. ఈ కొత్త పరికరాలు వస్తే మన ఇంటర్నెట్ వాడకం శైలే మారిపోనుంది. ఆపిల్ ల్యాబ్స్‌లో తయారవుతున్న ఆ మూడు మ్యాజికల్ గ్యాడ్జెట్స్ విషయానికొస్తే.. ముందుగా ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ గురించి మాట్లాడుకోవాలి.
ఇవి చూడటానికి సాధారణ కళ్లద్దాల్లాగే కనిపిస్తాయి. కానీ వీటిలో ఏఐ కెమెరాలు, సెన్సర్లు ఉంటాయి. ఒకటి హై-రిజల్యూషన్ ఫొటోలు, వీడియోల కోసం పని చేస్తే.. రెండోది ‘సిరి’కి పరిసరాలను వివరించే ‘కంప్యూటర్ విజన్’ కోసం సదా సిద్ధంగా ఉంటుంది. బిల్ట్-ఇన్ స్పీకర్లు, మైక్రోఫోన్ల సహాయంతో సిరిని నేరుగా ఆదేశించవచ్చు. దారిలో ఏదైనా ల్యాండ్‌మార్క్ గురించి అడిగినా, ఏదైనా వస్తువును చూపిస్తూ.. అది ఏంటని అడిగినా సిరి వెంటనే సమాధానం ఇస్తుంది. మరొకటి కెమెరాతో కూడిన ఎయిర్‌పాడ్స్. అవును, మీరు విన్నది నిజమే! ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌లో ఇప్పుడు కెమెరాలను అమర్చబోతున్నారు. ఇవి మీ చుట్టూ ఉన్న దృశ్యాలను ఏఐ సహాయంతో విశ్లేషించి.. మీ చెవిలో సమాచారాన్ని అందిస్తాయి.
మీరు ఎవరినైనా కలిసినప్పుడు వారి పేరు గుర్తులేకపోయినా.. ఈ ఎయిర్‌పాడ్స్ ఏఐ వారిని గుర్తించి మీ చెవిలో రహస్యంగా చెబుతాయి. ఇక యాపిల్ ఏఐ పెండెంట్ మరొకటి. యాపిల్ ఒక చిన్న పెండెంట్/ బ్రోచ్ వంటి పరికరాన్ని కూడా తయారు చేస్తున్నది. ఇది దాదాపు ‘ఎయిర్ ట్యాగ్’ సైజులో ఉంటుంది. ఇదో క్లిప్-ఆన్ గ్యాడ్జెట్‌లా పని చేస్తుంది. దీన్ని దుస్తులకు క్లిప్ చేసుకోవచ్చు. మెడలో గొలుసులా వేసుకోవచ్చు. దీనికి డిస్ప్లే ఉండదు కానీ కెమెరా, మైక్రోఫోన్ ఉంటాయి. ఇది ఐఫోన్‌కు ఒక నిరంతర తోడుగా ఉంటూ, మీ చుట్టూ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకుని రియల్-టైమ్‌లో సిరి ద్వారా సాయం అందిస్తుంది. ఈ సరికొత్త ఏఐ గ్యాడ్జెట్స్ అన్నీ ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానమై పని చేస్తాయి. దీంతో మన చేతిలో ఫోన్ ఉండాల్సిన అవసరం లేకుండానే.. కేవలం కళ్లజోడు లేదా ఎయిర్పాడ్స్తోనే మన డిజిటల్ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.