ముషీరాబాద్, మే 10: సామాజిక వాదం, మనువాదం ముసుగులో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వకుండా దగా చేశారని మండిపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం టికెట్లు, పదవులు ఇప్పించుకొన్నారని ఆరోపించారు.
అహంకారంతో కుటుంబ పాలనకు తెరలేపిన రేవంత్‌రెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. బీజేపీ పాలనలో దళితులపై అత్యాచారాలు, దాడులు అధికమయ్యాయని తెలిపారు. దళితులను ఆలయాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న బీజేపీకి దళితులను ఓట్లు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఒడిశాలో జగన్నాథ ఆలయంలోకి రానివ్వలేదని, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ఆహ్వానించకుండా ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు.