Kanji Drink | కాంజీ అనేది పులియబెట్టిన సాంప్రదాయ భారతీయ వేసవి పానీయం. ఇది సాధారణంగా నల్ల క్యారెట్, ఆవాలు, నీరు కలిపి తయారు చేస్తారు. ఈ సాంప్రదాయ వేసవి పానీయంలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. కనుక జీర్ణాశయ ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఇది ప్రసిద్ధి చెందింది. కాంజీని తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు శరీరానికి కూడా అనేక ప్రయోజనాలు అందుతాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, శరీరాన్ని చల్లబరిచే, హైడ్రేట్ చేసే పానీయాలు తీసుకోవడం చాలా అవసరం. అధిక వేడి కారణంగా జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అందుకే కాంజీ వంటి ఫెర్మెంటెడ్ పానీయాలు ఇప్పుడు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. శాస్త్రీయంగా కూడా ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. కాంజీలో ఉన్న ప్రోబయోటిక్స్ వేసవిలో సహజంగా మందగించే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి.
జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని 70-80% రోగనిరోధక కణాలు జీర్ణాశయంలోనే ఉంటాయి. అందువల్ల జీర్ణాశయం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కాంజీ ఫెర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారవుతుంది. కనుక ఈ ప్రక్రియ వల్ల దాని ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. కాంజీని సాధారణంగా సూర్యరశ్మిలో ఉంచి ఫెర్మెంట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇందులో ప్రోబయోటిక్స్ సంఖ్య పెరుగుతుంది. ఫెర్మెంటేషన్ సమయంలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇవి జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కాంజీలో ముఖ్యంగా లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం, ఎంటరోకోకస్ వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి శక్తివంతమైన ప్రోబయోటిక్స్‌గా పనిచేస్తాయి.
అదనంగా ఫెర్మెంటేషన్ ప్రక్రియ వల్ల శరీరంలో పోషకాల శోషణ కూడా పెరుగుతుంది. అందువల్ల కాంజీని భోజనంతోపాటు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఫెర్మెంటేషన్ వల్ల ఈ పానీయంలో మైక్రోన్యూట్రియెంట్స్ కూడా పెరుగుతాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాంజీ శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు శరీరాన్ని హైడ్రేట్ చేసే ఒక పానీయం. కనుక దీనిని వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు. సరైన విధంగా ఫెర్మెంట్ అయిన కాంజీలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణాశయ లైనింగ్‌ను బలపరచడంలో, జీర్ణాశయంలో వాపులను తగ్గించడంలో, జీర్ణాశయం అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాంజీ తయారీలో ప్రధానంగా ఉపయోగించే నల్ల క్యారెట్, మసాలాలు శరీరానికి హైడ్రేషన్‌తో పాటు జీర్ణాశయం ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అందువల్ల ఇది సహజ ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా పనిచేస్తుంది.
కాంజీ ఒక ఆరోగ్యకరమైన పానీయం. అయితే దాన్ని సరైన విధంగా నిల్వ చేసి సరైన సమయంలో తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం పొందవచ్చు. దీన్ని చల్లగా లేదా గది ఉష్ణోగ్రతలో తాగవచ్చు. కానీ ఎక్కువ వేడి తగిలితే పాడయ్యే అవకాశం ఉంది. ఇక కాంజీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం సమస్యలు రావచ్చు. కాంజీ వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటే రోగనిరోధక కణాలు కూడా బలంగా పనిచేస్తాయి. అందువల్ల సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. బయటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీరాన్ని చల్లబరచి హీట్ ను తగ్గిస్తుంది. ఇలా కాంజీ ఎంతో సహాయపడుతుందని, వేసవి కాలంలో దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
అలాగే ఇంట్లో కూడా సులభంగా కాంజీని తయారు చేసుకోవచ్చు. కాంజీని తయారు చేయడం చాలా సులభం. ముందుగా నల్ల క్యారెట్, ఆవాలు, నీరు సరైన నిష్పత్తిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేయాలి. సీసాను గట్టిగా మూసి సూర్యరశ్మిలో ఉంచాలి. కనీసం ఒక వారం పాటు ఫెర్మెంట్ అయ్యేలా ఉంచాలి. ఒక్కొక్కరి రుచి ఒక్కోలా ఉంటుంది కనుక మసాలాల నిష్పత్తిని వారి రుచికి అనుగుణంగా మార్చుకోవాలి. అయితే కాంజీ ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ జీర్ణాశయ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యుల సలహా లేకుండా కాంజీని తాగకపోవడం మంచిది. ఆరోగ్యవంతులైనా ఎక్కువగా తాగితే జీర్ణక్రియ ఎక్కువగా జరిగి అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి కాంజీని తీసుకోవడంలో మోతాదు, సమయం కూడా ముఖ్యమైనవి. మొత్తానికి కాంజీ ఒక సంప్రదాయ, తక్కువ ఖర్చుతో లభించే, ఆరోగ్యానికి ఉపయోగకరమైన పానీయం. వేసవిలో జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కాంజీని తాగడం ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.