Yuki Bhambri : భారత అత్యుత్తమ డబుల్స్ ఆటగాడు యుకీ బాంబ్రీ (Yuki Bhambri) ఇండియన్ వెల్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. అన్‌సీడెడ్‌గా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బాంబ్రీ – ఆండ్రే గొరాన్సన్ (స్వీడన్) ద్వయం దుమ్మురేపింది. వరుస సెట్లలో జోరు చూపించిన బాంబ్రీ, ఆండ్రే ధాటికి అలెగ్జాండర్ ఎర్లెర్(ఆస్ట్రేలియా) – అండ్రీవ వవస్సోరి(ఇటలీ) జంట తోక ముడించింది. ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నమెంట్లో సెమీస్ చేరడం బాంబ్రీ కెరీర్లో పెద్ద విజయం.
గత రెండేళ్లుగా భారత ఆటగాళ్లు ఏటీపీ మాస్టర్స్‌లో ఫైనల్ చేరలేదు. ఈ నేపథ్యంలో యుకీ బాంబ్రీ ఇండియన్ వెల్స్‌లో టైటిల్ పోరుకు అడుగు దూరంలో నిలిచి ఆశలు రేపుతున్నాడు. ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన బాంబ్రీ – అండ్రే ద్వయం క్వార్టర్ ఫైనల్లోనూ చెలరేగింది.
ప్రత్యర్ధి దూకుడు అడ్డుకట్ట వేస్తూ 6-3, 7-6(7)తో విజయం సాధించి సెమీస్ బెర్తు పట్టేసింది. నిరుడు యూఎస్ ఓపెన్‌లో సెమీస్ ఆడిన బాంబ్రీ.. ఈసారి ఇండియన్ వెల్స్లోనూ సత్తా చాటుతూ టైటిల్ లక్ష్యంగా సాగుతున్నాడు.