హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో పరిశ్రమలకు కేటాయించాల్సిన భూములు వేగంగా కనుమరుగైపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, హెచ్ఎండీఏలోని కొందరు అధికారుల ధనదాహం వల్ల చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సీఎల్‌యూ) ప్రక్రియ సమూలంగా మారిపోయింది. గతంలో అవసరాలకు అనుగుణంగా వినియోగించిన ఈ విధానాన్ని ఇప్పుడు భూముల విలువను బట్టి అన్వయించుకుంటూ సొమ్ము చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో సీఎల్‌యూ దరఖాస్తులను ఆమోదించేందుకు ప్రభుత్వ పెద్దలు అత్యుత్సాహం చూపుతూ హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలకమైన మాస్టర్ ప్లాన్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. తద్వారా పారిశ్రామిక భూములను డిమాండ్ ఎక్కువగా ఉండే మల్టీపర్పస్, రెసిడెన్షియల్ జోన్లలోకి రాత్రికిరాత్రే మార్చేస్తున్నారు. అలా ఇండస్ట్రియల్, బఫర్ జోన్ల పరిధిలోని వందల ఎకరాల భూములు మాయమయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఎకరానికి రూ.10-15 లక్షల చొప్పున దండుకున్నట్టు సమాచారం.
2 నెలల్లోనే 1,800 ఎకరాలు మార్పిడి
సామాన్యుల ఫైళ్లను ఏండ్ల తరబడి పెండింగ్‌లో పెట్టే హెచ్ఎండీఏ అధికారులు గత 2 నెలల్లోనే 1,800 ఎకరాల వినియోగ స్థితిని మార్చేశారు. వాటిని మల్టీపర్పస్, రెసిడెన్షియల్ జోన్లలోకి బదలాయించారు. రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, మేడ్చల్, శామీర్‌పేట, పటాన్చెరు, కంది, శంకర్పల్లి లాంటి అత్యంత విలువైన ప్రాంతాల్లోని వందలాది సర్వే నెంబర్లలో ఇండస్ట్రియల్ భూములను ఒక్క దెబ్బతో మల్టీపర్పస్ జోన్లో చేర్చారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, వారి అనుచరులతోపాటు బడా ల్యాండ్ మాఫియా ప్రమేయం ఉన్నట్టు తెలుస్తున్నది.
బడా నేతల చేతుల్లో పెత్తనం
హెచ్ఎండీఏలో తిష్టవేసిన ప్రభుత్వ పెద్దల అనుచరుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తున్నట్టు వినికిడి. సాధారణంగా భూ వినియోగ మార్పిడి కోసం సామాన్య ప్రజలు చేసుకునే దరఖాస్తులను హెచ్ఎండీఏ అధికారులు ఓ పట్టాన క్లియర్ చేయరు. ఒకవేళ నిబంధనలకు అనుగుణంగా ఏ అధికారి అయినా ఆ ఫైళ్లను త్వరగా క్లియర్ చేసినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల వద్ద నెలల తరబడి ఆగిపోతుంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఈ పరిస్థితి దాపురించిందని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫైల్ స్టేటస్ తెలియకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
ఎకరానికి రూ.10-15 లక్షలు
చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ విధానంతో ఎకరానికి రూ.10-15 లక్షల చొప్పున చేతులు మారుతున్నట్టు వినికిడి. ఇదే అదనుగా పలువురు రియల్ వ్యాపారులు తక్కువ ధరకే ఇండస్ట్రియల్ భూములు కొని పెద్దల అండతో వాటిని మల్టీపర్పస్, రెసిడెన్షియల్ జోన్లలోకి మార్చుకోవడంతో కోట్లకు పడగలెత్తుతున్నారు.
నీరుగారుతున్న మాస్టర్‌ప్లాన్ ఆశయాలు
వాస్తవానికి హైదరాబాద్ భవిష్యత్తు, పర్యావరణ సమతుల్యత, ఆర్థిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2031ను రూపొందించారు. కానీ, ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో ఆ మాస్టర్ ప్లాన్ ఆశయాలకే దెబ్బ తగులుతున్నది. పరిశ్రమల స్థాపన, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాల్సిన భూములను రియల్టర్లకు కట్టబెట్టడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు విఘాతం కలుగుతుంది. ఇండస్ట్రియల్ జోన్లలో నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మించడంతో మురుగు పారుదల, సీవరేజీ, తాగునీరు, ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తమవుతుంది.