హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : గద్దెనెక్కినప్పటి నుంచి భూముల చుట్టూ పరిభ్రమిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మరో భారీ భూపందేరానికి తెరలేపింది. విలువైన స్థలాలను నచ్చిన వారికి దొడ్డిదారిలో కట్టబెడుతున్న ప్రభు త్వం కన్ను.. ఇప్పుడు ఉర్దూ అకాడమీ భూములపై పడ్డది. శేరిలింగంపల్లిలోని ఉర్దూ అకాడమీకి చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన 1.04 ఎకరం భూమిని ఎన్ఎన్ ఇన్ఫ్రా కంపెనీకి లీజు ముసుగులో కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు ఆరోపణలున్నాయి. నిబంధనలను కాలరాస్తూ టెండర్లు పిలువకుండా, క్యాబినెట్లో చర్చించకుండా షాదీఖాన నిర్మాణం పేరిట ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థకు ధారాదత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వ వైఖరిపై ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నది.
షాదీఖాన కోసం 30 ఏండ్ల లీజుకు..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం దర్గా హుస్సేన్ షా వలీ గ్రామం సర్వే నంబర్ 29లోని ఉర్దూ అకాడమీకి చెందిన 1.04 ఎకరాలు (5220 చ. గజాలు)ను ఎన్ఎన్ ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్స్ అనే ప్రైవేట్ కంపెనీకి 30 ఏండ్లు లీజుకు ఇచ్చింది. ఇందుకు సంబంధించి గత జూలై 16న జీవో నంబర్ 20 జారీ చేసింది. ఇందులో ఉర్దూ భవనంతోపాటు షాదీఖాన, వాణిజ్య సముదాయాన్ని బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిర్మించనున్నది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులను బహిర్గతం చేయకపోవడం మైనారిటీ వర్గాల్లో అనేక అనుమానాలు, తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది.
నిబంధనలకు నీళ్లొదిలి.. టెండర్లు పిలువకుండానే..
మైనారిటీ సంక్షేమ శాఖకు చెందిన స్థలాల్లో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బహిరంగ టెండర్లు పిలిచి తక్కువకు కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన మీదటే ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కలెక్టర్ నేతృత్వంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో ముగ్గురు మతపెద్దలు లేదా ముస్లిం సంఘాల బాధ్యులు, ఉర్దూ అకాడమీ సభ్యుడితో ఏర్పాటుచేసిన కమిటీ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుంటుంది. కానీ ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఆక్షన్ నిర్వహించకుండా టెండర్లు పిలువకుండా ఎన్ఎన్ ఇన్ఫ్రాకు స్థలాన్ని లీజుకు ఇవ్వడం వివాదానికి దారితీస్తున్నది.
ఎన్ఎన్ ఇన్ఫ్రాపై ఎందుకంత ప్రేమ?
రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని చన్నైకి కంపెనీకి లీజుకు ఇవ్వడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. సదరు కంపెనీపై సర్కార్కు ఎందుకంత ప్రేమ అని మైనారిటీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మంత్రివర్గంలో చర్చించకుండా ఉత్తర్వులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని నిలదీస్తున్నాయి. దీనికి వెనుక ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుత బడ్జెట్లో షాదీఖానల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించిందని గుర్తుచేస్తున్నారు. కానీ ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయకుండా ఉన్నట్టుండి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
మైనారిటీ సెక్రటరీకి ఆ అధికారం లేదు : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ఉర్దూ అకాడమీకి చెందిన 5,220 చదరపు గజాల భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి 30 ఏండ్లు లీజుకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఎంపీ అసదుద్దీన్ మండిపడ్డారు. లీజు వ్యవహారంపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. లీజుకు ఇచ్చే అధికారం మైనారిటీ సెక్రటరీకి లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వెంటనే లీజు రద్దు చేయాలి : వహీద్
ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఉర్దూ అకాడమీ భూమిని లీజు పేరిట ఎన్ఎన్ ఇన్ఫ్రాకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నదని వక్ఫ్ బోర్డు మాజీ మెంబర్ వహీద్ ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం లీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.