జూలపల్లి, సెప్టెంబర్ 23 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం బాలరాజుపల్లిలో బుధవారం విషాదం అలుముకుంది. పిడుగుపాటుతో ఒక మహిళ మృతిచెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బాల్రాజ్పల్లిలో బుధవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.
ధర్మారం మండలం సామల పల్లి గ్రామానికి చెందిన మారం అంజమ్మ (50) అనే మహిళ, కొత్తూరు గ్రామానికి చెందిన దోనూరు లక్ష్మి(45)తోపాటు మరికొంత మంది కూలీలు ఒక ఆటోలో బాలరాజుపల్లికి వ్యవసాయ పనులు చేయడానికి వచ్చారు. రైతు కుంటూరు రామయ్య పత్తి చేనులో కూలీలు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో మారం అంజమ్మ పిడుగుపాటుకు గురై, అక్కడికక్కడే మృతి చెందింది.
దోనూరు లక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఆమె కాళ్లు, చేతులు కదలలేక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆమెను వైద్య చికిత్సల కోసం కరీంనగర్ లోని సర్కార్ దవాఖానకు తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందుతోంది. ఆమె ఆరోగ్యస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.