హైదరాబాద్, జూలై 27( నమస్తే తెలంగాణ): హిల్ట్ పాలసీ ప్రకటించి ఏడాది గడిచినా ఒక పరిశ్రమ కూడా స్వచ్ఛందంగా తరలకపోవడంతో, ఇక కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హైదరాబాద్ నగర పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అవతలికి తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కనీసం 10% పరిశ్రమల యాజమాన్యాలు కూడా స్పందించకపోవడంతో ప్రభుత్వం బలవంతంగా తరలించాలని నిర్ణయించింది. పాలసీ ప్రకటించి దాదాపు ఏడాది గడుస్తున్నా, ఓఆర్ఆర్ ఆవలికి ఇప్పటివరకూ ఒక పరిశ్రమ కూడా తరలివెళ్లలేదు. అధికారులు నోటీసులు జారీ చేసినా, ప్రభుత్వం ఆదేశాలు పంపినా పరిశ్రమల యజమానులు స్పందించడం లేదు. దీంతో హిల్ట్ పాలసీ అమలు అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. పరిశ్రమల యాజమాన్యాలకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ఇకపై నోటీసులు, హెచ్చరికలతో సరిపెట్టకుండా తప్పనిసరి తరలింపుపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వం బలవంతంగా తరలిస్తే కోర్టుకు వెళ్లాలని పరిశ్రమల యజమానులు ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్నట్టు సమాచారం.
జోనల్ కమిషనర్ల ద్వారా నోటీసులు
కాలుష్య తీవ్రతపై ‘ఎన్విరాన్మెంట్ ప్రొటక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (ఈపీటీఆర్ఐ) చేసిన అధ్యయనంలో, హైదరాబాద్ నగరంలో 1,746 కంపెనీలు తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్నట్టు తేలింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫార్మా, కెమికల్, మెటల్, పేపర్, రబ్బర్, పెయింట్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన పరిశ్రమలు కాలుష్య ఉద్గారం చేస్తున్నట్టు కాలుష్య నియంత్రణ మండలి గుర్తించినట్టు తెలిసింది. మొత్తంగా 2,800కుపైగా కంపెనీలను గుర్తించిన టీజీఐఐసీ, జోనల్ కమిషనర్ల ద్వారా నోటీసులు జారీ చేసింది. స్పందన లేకపోవడంతో 1,746 కంపెనీలకు రెండోసారి హెచ్చరికలు కూడా పంపింది. తరలింపు జాబితాలో 800కుపైగా చిన్న, మధ్య, భారీతరహా ఔషధ తయారీ సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ నగర విస్తరణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలతో తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ అమల్లో ప్రభుత్వం ఇక వెనకి తగ్గే పరిస్థితి లేదని అధికార వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
ఆ బాధ్యత ఎవరిది?
పరిశ్రమల యజమానులు మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న పరిశ్రమలను బలవంతంగా తరలించడం అన్యాయమని వాదిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయాలు అమల్లోకి రావడం లేదు. హిల్ట్ పాలసీ ప్రకటించిన నాటి నుంచే బీఆర్ఎస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నది. పారిశ్రామిక భూములను రియల్‌ఎస్టేట్‌కు అనుకూలంగా మార్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చారని, కన్వర్షన్ ఫీజుల నిర్ణయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. సుమారు 9,292 ఎకరాల భూమి వినియోగం మారితే బిల్డర్లకే ఎకువ ప్రయోజనం చేకూరుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదని, కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి, భూమి కన్వర్షన్ చేయించుకుంటే, వచ్చే ప్రభుత్వం దానిని రద్దు చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని యాజమాన్యాలు అడుగుతున్నాయి.
తరలింపు ప్రణాళిక
హైదరాబాద్ నగరం చుట్టూ 64 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూములను ప్రభుత్వం గుర్తించింది. ప్రధానంగా 800 ఫార్మా కంపెనీలను రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ప్రతిపాదిత ఫార్మాసిటీకి తరలించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది. కాటేదాన్, జీడిమెట్ల ప్రాంతాల నుంచి దాదాపు 35 స్టీల్ కంపెనీలు, వంటనూనె పరిశ్రమలను వికారాబాద్ జిల్లా రాకంచర్లలోని 150 ఎకరాల ఇండస్ట్రియల్ పారుకు, టెక్స్టైల్ పరిశ్రమలను జహీరాబాద్‌లోని బుచినేపల్లి ఇండస్ట్రియల్ పారుకు, సంగారెడ్డిలోని ఇంద్రేశం ఇండస్ట్రియల్ పారుకు తరలించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది.