వికారాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సమావేశాలు, ర్యాలీలు, మైకులు మూగబోనున్నాయి. దాదాపు రెండు నెలలపాటు ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించాయి. అయితే నేటి సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది. పోలింగ్‌కు ముందు 48 గంటల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ సోషల్ మీడియా, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో చర్చలు తదితరాలను ప్రచారం చేయొద్దని.
ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని ఎన్నికల సంఘం సూచించింది. అయితే ప్రచారం ముగియడంతో ఓటర్లను డబ్బు, మద్యంతో ప్రలోభపెట్టే అవకాశాలున్న దృష్ట్యా జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లాలో ఇప్పటికే ఆరు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలుండగా, మరో 6 బృందాలు నేటి సాయంత్రం 5 గంటల నుంచి తనిఖీలను ముమ్మరం చేయనున్నాయి. అదేవిధంగా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు నేటి సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించారు.
నేటి సాయంత్రంతో మైకులు మూగబోనున్నాయి. శనివారం ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గమంతటా విస్తృతంగా పర్యటించేలా ఆయా పార్టీల అభ్యర్థులు ప్లాన్ చేసుకున్నారు. నేడు చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి సుడిగాలి పర్యటన చేసేలా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నా రు. దాదాపు రెండు నెలలుగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికెళ్లినా స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు పలుకుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు సుపరిచితుడు, బీసీ బిడ్డ కావడంతో బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా బీఆర్ఎస్ అభ్యర్థి కాసానికి మద్దతు తెలుపుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాసానిని గెలిపించడమే ధ్యేయంగా మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రచారంలో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కాసానికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ.. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజల ముందు ఎండగడుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో పరిసమాప్తి కానున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల స్టార్ క్యాంపెయినర్లు నేడు జిల్లాలో తమ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా నేడు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీఅనంతపద్మనాభ కాలేజీ మైదానంలో జరుగనున్న బహిరంగసభలో కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు.
అదేవిధంగా కాం గ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా తాండూరు పట్టణంలో నిర్వహించే ప్రచార సభకు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంకాగాంధీ హాజరుకానున్నారు. రంజిత్‌రెడ్డిని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో ఆయన పొరపాటున విజయం సాధిస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేసి చక్రం తిప్పుతారని.. అందువల్ల అతడిని ఓడించేందుకు సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని సమాచారం..!