హైదరాబాద్ : మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడివున్నదని కేసీఆర్ తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం(International Womens Day) సందర్భంగా రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందని, మానవ మనుగడను కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక కష్టాలతో నిర్వర్తిస్తున్న మహిళ త్యాగశీలి అని కేసీఆర్ కొనియాడారు. ఆకాశంలో సగమై, అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగివున్న మహిళా లోకానికి అన్ని రంగాల్లో పురుషునితో సమానమైన అవకాశాలను మరింతగా అందించినప్పుడు మాత్రమే కుటుంబాభివృద్ధి సంపూర్ణ మవుతుందని, తద్వారా సమాజ, దేశ, ప్రపంచాభివృద్ధి ఫరిడవిల్లుతుందని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అనంతర స్వయంపాలనలో తెలంగాణ మహిళల పాత్ర గొప్పదని వివరించారు. మహిళా సాధికారత దిశగా, వారి సంక్షేమం, ప్రగతికోసం పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. మహిళా సాధికారతను మరింతగా పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరమున్నదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.