RAKASA Movie | ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల మరియు ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్, బ్యూటిఫుల్ నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘రపప్పా.. రపప్పా’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కథ పరంగా చూస్తే.. ప్రేయసి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్న తరుణంలో, హీరో తన బాధను ఎంతో ఫన్నీగా, ట్రెండీ పదాలతో వ్యక్తం చేసే తీరు ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. అనుదీప్ దేవ్ అందించిన క్యాచీ ట్యూన్ యువతను ఉర్రూతలూగిస్తుండగా.. రఘురాం అందించిన సాహిత్యం నేటి తరం ఆలోచనలకు తగ్గట్టుగా ఉంది. తనదైన శైలిలో రామ్ మిర్యాల పాడిన విధానం ఈ పాటకు ప్రాణం పోసింది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ సరిగమ సొంతం చేసుకోగా, ఓవర్సీస్ పంపిణీ బాధ్యతలను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ (వరల్డ్ వైడ్) మరియు ప్రత్యంగిరా సినిమాస్ (కెనడా) భారీ ఎత్తున చేపడుతున్నాయి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి వంటి దిగ్గజ నటులతో పాటు గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: మానస శర్మ
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్
సినిమాటోగ్రఫీ: రాజు ఎదురోలు
ఎడిటింగ్: అన్వర్ అలీ
సంగీతం: అనుదీప్ దేవ్
పీఆర్ఓ: ఎస్.కె.నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)