ఖమ్మం రూరల్: సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తన సర్వీస్ మూడేళ్లు దాటితేనే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటారు. ప్రైవేటు ఉద్యోగి ఇతర సంఘటిత కార్మికులు సైతం గిట్టుబాటు కాకపోతే ఇంకో మార్గం ఎంచుకోవటం పరిపాటిగా మారుతుంది. కానీ, ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పెద్దతండ పంచాయతీ వర్కర్ గా పనిచేస్తున్న జంగం లక్ష్మి మూడు దశాబ్దాలుగా సఫాయిగా సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. పంచాయతీ వర్కర్ గా పనిచేస్తున్న లక్ష్మి భర్త విధి నిర్వహణలోని 30 ఏళ్ల క్రితం మరణించాడు.
బలహీన వర్గాలకు చెందిన లక్ష్మికి ఆస్తిపాస్తులు లేవు. కనీసం ఉండటానికి గూడు కూడా లేని పరిస్థితి. భర్త చనిపోయిన సమయానికి గాను ముగ్గురు ఆడపిల్లల సంతానం పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు ఆడపిల్లల పోషణ తోడు కావడంతో ఆమె కష్టాలు రెట్టింపయ్యాయి. అయినా మొక్కవోని విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగిన లక్ష్మి ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేసి నేటికి సఫయి కార్మికురాలిగా సేవలు కొనసాగిస్టుండటం విశేషం.
ఖమ్మం రూరల్ మండలం యం వెంకటయపాలెం గ్రామానికి చెందిన జంగం లక్ష్మి పొద్దుందాక పారిశుద్ద కార్మికురాలుగా తన విధులు నిర్వహిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత కూతుర్ల ఆలనా పాలన చూస్తుంది. జీవితాంతం అష్ట కష్టాలను అనుభవిస్తూ శేష జీవితానికి చేరుకున్న లక్ష్మి సర్కారు సాయం కోసం ఎదురుచూస్తుంది. తల దాచుకోవడానికి గూడు కోసం ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న లక్ష్మి కోరిక ఇకనైన నెరవేరుతుందని ఆశిద్దాం.