ఖైరతాబాద్/బంజారాహిల్స్/ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 26 : చర్చలు లేకుండా పార్లమెంట్లో బిల్లు పాసైతే అది ముందుకు సాగదని, రైతు చట్టాల విషయంలో అదే జరిగిందని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి అన్నారు. భారతరాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సౌత్ ఇండియా అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ రాధారాణి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రైటు టూ డిబేట్ గురించి ప్రస్తావించారని, చర్చలు జరుగకుండా కొన్ని చట్టాలు తయారవుతున్నాయని, అదే క్రమంలో రైతు వ్యతిరేక చట్టాలు రూపొందించడం వల్ల అవి సఫలీకృతం కాలేకపోయాయన్నారు.
చర్చలు లేకుండా బిల్లులు పాస్ చేయడం మంచి పరిణామం కాదన్నారు. ఉచిత విద్య పిల్లలందరికీ అందినప్పుడే సంపూర్ణ దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజ్యాంగ విలువలను ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యతగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సౌత్ ఇండియా అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు నాగేందర్, సీనియర్ న్యాయవాది ఉపాధ్యాయ, ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి సామల రవీందర్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహ్మద్ ముంతాజ్ పాషా, సీనియర్ న్యాయవాదులు ధనలక్ష్మి, ఎ. బాలకృష్ణ, యాదగిరి పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో
జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన వెబినార్‌లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఢిల్లీ) వీసీ ప్రొఫెసర్ పి. కృష్ణదేవరావు హాజరై ఆయన చిత్ర పటానిక పూలమాల వేసి నివాలర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కె. సీతారామారావు, డైరెక్టర్ (అకాడమిక్) ప్రొఫెసర్ సుధారాణి, రిజిస్ట్రార్ డాక్టర్ జి. లక్ష్మా రెడ్డి, సీఎస్టీడీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సెంటర్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్ ఇన్చార్జి డాక్టర్ జి. సరోజ తదితరులు పాల్గొన్నారు.
ఓయూలోని రాజ్యాంగ దినోత్సవాన్ని ఇంగిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో జరిగిన కార్యక్రమ లైవ్ కవరేజీని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం రాజ్యాంగను అందరూ చదివారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరై అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గుర్తించుకోవాలని సూచించారు.