కొన్ని ప్రయాణాలకు కారణాలు ఉండకపోయినా.. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి ప్రయాణమే ఈ లేడీ ఫొటోగ్రాఫర్ది. స్వేచ్ఛగా జీవించాలని భావించిన ఆమె గొప్ప చదువులు చదివి, ఉన్నత ఉద్యోగం సాధించింది. అక్కడితో సంతృప్తి చెందక ప్రకృతిలోకి పయనించింది. రకరకాల పక్షుల జాడలు తెలుసుకొంటూ.. వాటిని తన కెమెరాలో నిక్షిప్తం చేసింది. అలా క్లిక్ మనిపించిన ‘విహంగామా’ను అందరికీ పరిచయం చేయాలని పుస్తకాలు ప్రచురించింది. నచ్చిన పని చేయడానికి వయసుతో పని లేదని నిరూపిస్తున్న డాక్టర్ వీఏ మంగను జిందగీ పలకరించింది. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..

సివిల్ ఇంజినీర్ అయిన మా నాన్నగారు నా చిన్నప్పుడు కొన్నాళ్లు శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేశారు. ఆ సమయంలో నేను, మా తమ్ముడు అక్కడికి వెళ్లేవాళ్లం. నాన్నతో అడవిలోకి వెళ్లి గంటల తరబడి గడిపేవాళ్లం. అందుకేనేమో ప్రకృతితో నాకు వీడదీయలేని అనుబంధం ఏర్పడింది. మా సొంతూరు ఖమ్మం. పై చదువుల కోసమని హైదరాబాద్‌కి వచ్చాను. ఉస్మానియాలో ఎంఎస్సీ పూర్తి చేసి భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో ఉద్యోగంలో చేరాను. ఒకవైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరోవైపు హెచ్‌సీయూలో పీహెచ్డీ పూర్తి చేశా. 26 ఏళ్ల నా అధ్యాపక వృత్తిలో అసోసియేట్ ప్రొఫెసర్ వరకు ఎదిగాను.
వ్యక్తిగత కారణాల వల్ల 2003లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. ఆ సమయంలోనే మా ఆత్మీయులొకరు కెమెరాను బహుమతిగా ఇచ్చారు. అప్పటి వరకు ఫొటోగ్రఫీలో నాకు ఎలాంటి అనుభవం లేదు. ఆ కెమెరాను గుర్తుగా దాచుకున్నా. 2009లో మా ఇంటి దగ్గరున్న పార్కులో చెట్లకు నిండుగా ఉన్న పువ్వులను చూసి వాటిని ఫొటో తీసేందుకు కెమెరా తీసుకెళ్లాను. ఒకరోజు ఆ పువ్వుల దగ్గరికి ఓ తేనె పిట్ట వచ్చింది. దాన్ని ఫొటో తీయాలని ప్రయత్నిస్తే అది నా కెమెరాకు చిక్కలేదు. ఎంత కష్టపడ్డా ఆ పక్షి ఫొటో తీయలేకపోయా.

ప్రారంభంలో నేను తీసిన ఫొటోలు ఎలా వచ్చాయో పట్టించుకునేదాన్ని కాదు. పువ్వుల ఫొటోలు తీసిన నాకు పక్షి ఫొటో తీయలేకపోయాననే బాధ చాలా రోజులు వెంటాడింది. ఆ బాధలోంచి పట్టుదల వచ్చింది. ఎగిరే పక్షుల ఫొటోలు ఎలా తీస్తారో తెలుసుకోవడం మొదలుపెట్టాను. అందుకు సంబంధించిన పుస్తకాలను చదువుతున్న క్రమంలో పక్షి జాతులు, వాటి ప్రత్యేకతలు పరిచయమయ్యాయి. సుమారు 500కు పైగా పుస్తకాలను చదివితే గానీ ఈ పక్షుల ప్రపంచం అర్థం కాలేదు. ఇక అప్పటినుంచి కచ్చితంగా ఫొటోగ్రఫీ నేర్చుకోవాలనే కుతూహలం మొదలైంది. ప్రకృతి, పక్షులను అందంగా చూపించాలనే కోరిక కలిగింది.
పుస్తకాలు చదివి మాత్రమే ఫొటోగ్రఫీ నేర్చుకొని ఫీల్డ్‌లోకి వెళ్లా. పక్షుల ఫొటోలు తీయాలంటే ఉదయం అనుకూలంగా ఉంటుందని తెలుసుకొని ఒక్కదాన్నే ఉదయం నాలుగు గంటలకు లేచి ప్రకృతిని వెతుక్కుంటూ కారులో బయలుదేరేదాన్ని. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువులు, చెట్లు, పార్కులు ఇలా ఒక్కదాన్నే కెమెరా పట్టుకొని తిరిగేదాన్ని. అలా ఏడాదిలోనే ఫొటోగ్రఫీలో ఫర్ఫెక్ట్ అయిపోయా. అమీన్పూర్ చెరువు, ఉస్మాన్‌సాగర్, ఘట్కేసర్, కేబీఆర్ పార్క్, వనస్థలి పార్క్ మొదలైన ప్రాంతాల్లో కనిపించే పక్షులన్నీ నా కెమెరాకు చిక్కాయి. ఒక్కదాన్నే వెళ్లడం వల్ల సమయంతో పనిలేకుండా వాటిని నిదానంగా పరిశీలిస్తూ కావల్సినంత సేపు అక్కడే గడిపేదాన్ని.
బర్డ్ ఫొటోగ్రఫీ కోసం అనేక పుస్తకాలు చదివిన నాకు ఈ ప్రాంతంలోని పక్షులను పరిచయం చేయాలన్న ఆలోచన మొదలైంది. అలా 2017లో చెట్లకు, పక్షులకున్న అనుబంధాన్ని వివరిస్తూ ‘వన్ ట్రీ మెనీ బర్డ్స్’ బుక్ ప్రచురించా. అందులో 50 రకాల పక్షులు, చెట్ల ఫొటోలను పొందుపరిచా. ఆ బుక్ రాసే క్రమంలో ఎన్నెన్నో మధురానుభూతులు పోగు చేసుకోగలిగాను. ఒకరోజు ఘట్కేసర్ వైపు వెళ్తుంటే మొండెం మాత్రమే ఉన్న తాటి చెట్టొకటి కనిపించింది. కాస్త ఆగి చూస్తే ఓ వడ్రంగి పిట్ట ఆ చెట్టుకు రంధ్రం చేయడం నన్ను అబ్బురపరిచింది. ఆ చెట్టు దగ్గరికెళ్లి పరిశీలిస్తే రామచిలుకలు, మైనా, పాలపిట్టలు ఇలా ఎన్నో రకాల పక్షులు ఆ చెట్టుకు రంధ్రాలు చేసుకొని గూళ్లు కట్టుకున్నాయి. ప్రకృతి చేసే అద్భుతాలను చూసేందుకు ఎనిమిది నెలలపాటు ప్రతిరోజూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లి వాటిని చూస్తూ ఫొటోలు తీస్తూ ఆనందపడ్డాను. అలాంటి అద్భుతమైన ఫొటోలను ఈ బుక్‌లో ప్రచురించా.
ఆ తరువాత ఫీల్డ్ గైడ్ ఫొటోగ్రఫీలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 226 పక్షిజాతులను గుర్తించా. వాటితో ‘బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్’ పేరుతో రెండో పుస్తకం ప్రచురించా. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన నాకు కలలో కూడా పక్షుల కిలకిలారావాలు, ప్రకృతి పలకరింపులే గుర్తొచ్చేవి. అలా నా ఆలోచనలు పంచుకుంటూ ‘ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్’ పేరుతో మూడో పుస్తకం తీసుకొచ్చా. ఇవన్నీ చేస్తున్న క్రమంలో నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాలనే ఆలోచనతో ‘బర్డ్ వాచర్ జర్నల్’ పేరుతో నా ప్రయాణాన్ని వివరించా. ఒకప్పుడు ఇంట్లో ఉండే పుస్తకాల్లో కొన్ని పక్షుల ఫొటోలు చూసినపుడు వాటిని నేరుగా చూస్తే బాగుండు అని అనుకునేదాన్ని. కానీ నా చేతులతో వాటిని ఫొటోలు తీసే స్థాయికి ఎదిగినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను.

ఇంట్లో వాళ్ల సహకారంతోనే నా ప్రయాణం ఇంత హాయిగా సాగుతున్నది. నాకు నచ్చినట్లు స్వేచ్ఛగా జీవించాలని కోరుకునే నేను ఇప్పటివరకు ఎక్కడా రాజీ పడలేదు. కష్టపడకుండా ఏదీ మన దగ్గరకి రాదనే ఆలోచన నాది. ఎంఎస్సీ చేయగానే కష్టపడ్డాను గనుకే ఉద్యోగమెచ్చింది. ఆ తరువాత పీహెచ్డీ, బెస్ట్ టీచర్ అవార్డులు ఇలా అనేక విజయాలు నా కష్టానికి ఫలితమనే చెప్పుకొంటా. ప్రకృతిలో తిరుగుతున్నప్పుడు ఇందులోని అందం పదిమందికి చూపించాలనేది నా ఆశ. భవిష్యత్తులో ప్రకృతితో మరింత మమేకమై రకరకాల పక్షులను పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
ఎందుకు ఇటువైపు వచ్చావని నన్ను అడిగే వారికి ప్రకృతే సమాధానం. డబ్బులు ఖర్చుపెడితేనే అసలైన సంతోషమని భావించే నేటి తరం వీకెండ్ వస్తే చాలు హోటళ్లు, సినిమా థియేటర్లలో గడుపుతున్నది. ఆ ఒక్కరోజును ప్రకృతికి కేటాయించండి. అనుభూతి చెందండి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు పక్షుల ఫొటోలను సెల్ఫోన్లలో చూపించే బదులు నేరుగా చూపించండి. మీరూ అనుభూతి చెందుతారు.
– రాజు పిల్లనగోయిన