Mumbai : మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం ఉదయం బస్సు ప్రమాదం జరిగింది. వాహనదారులపైకి ప్రభుత్వ బస్సు దూసుకెళ్లడంతో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన ముంబై నగరంలోని దాదార్ ఏరియా, ప్లాజా సినిమా వద్ద సోమవారం ఉదయం 9.30 గంటలకు జరిగింది. ప్రమాదం జరిగిన ఈ ప్రాంతం ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒకటి.
ఉదయం బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన ఒక బస్సు వేగంగా వెళ్తూ అదుపుతప్పింది. రోడ్డుపై వెళ్లే వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న ట్రాఫిక పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రెండు కార్లు, ఒక ట్యాక్సీ, రెండు బైకులను ఢీకొంది. దీంతో బాధితులతోపాటు చుట్టుపక్కల వారు కూడా షాక్కు గురయ్యారు.
ఈ ఘటనలో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. గాయపడ్డవారిలో ఇద్దరు బైకర్లు, కండక్టర్ ఉన్నారు. పోలీసులు వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదం కారణంగా ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచించారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ మళ్లించారు.