హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): సాగునీటిపై ప్రతిపక్షం నిలదీసిన ప్రతిసారీ కాంగ్రెస్ సర్కార్‌ది ఒకటే రాజకీయం. వరుసబెట్టి ప్రాజెక్టుల సందర్శనకు పరుగు పరుగున వెళ్లడం. పనుల పూర్తికి గడువులు ప్రకటించడం. ప్రణాళికలు రూపొందించినట్టు హడావుడి చేయడం. అంతే నిధులివ్వదు. ఆ ప్రణాళికలు ఆచరణలోకి రావు. గడువుల తేదీలు మారడం పరిపాటిగా మారింది. కన్నెపల్లి, సీతమ్మసాగర్, దేవాదుల, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు.. పథకం ఏదయినా సరే అదే తీరు. ప్రాజెక్టులపై రాజకీయలు చేయడం తప్ప పూర్తిచేసే ఉద్దేశమే లేదన్నట్టుగా సర్కార్ వ్యవహరిస్తున్నది. లక్షలు వెచ్చించి చేసే పర్యటనలన్నీ ప్రతిపక్షంపై బురద చల్లేందుకు, లేదంటే ప్రజల దృష్టిని మరల్చేందుకు తప్ప సందర్శనలతో ఇప్పటివరకు సాధించిన పురోగతి శూన్యం.
కన్నెపల్లిపై రాజకీయం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ మొదటి నుంచీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. మేడిగడ్డ ఘటనను సాకుగా చూపుతూ మరింత దుష్ప్రచారాలకు తెరతీసింది. వాస్తవంగా బరాజ్ పునరుద్ధరణ పనులను ఎన్డీఎస్ఏ నివేదిక సూచనల మేరకు రాష్ట్రప్రభుత్వమే చేపట్టాల్సి ఉన్నది. జియోఫిజికల్, జియో టెక్నికల్, జియో పెనెట్రేటింగ్ రాడార్ టెస్ట్‌లను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్) ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్నది. ఆ టెస్టుల నివేదికలను సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏకు పంపి, డిజైన్లను కూడా రూపొందించి వాటికీ ఆమోదం పొందిన తరువాత పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, ఎన్డీఎస్ఏ తుది నివేదికను సమర్పించి ఏడాది దాటినా టెస్టులు పూర్తిచేయలేదు. ప్రాజెక్టుపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ, సందర్శిస్తూ హడావుడి చేయడం, బీఆర్ఎస్పై నిందారోపణలు చేయడానికే పరిమితమైంది. అధికారంలోకి రాగానే తొలుత మంత్రుల బృందం పర్యటించింది. ఆ తరువాత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించారు. తదుపరి మరోసారి మంత్రుల బృందం సందర్శించింది.
గత ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి సందర్శించారు. కానీ, ఇప్పటికీ ఎక్కడి పరీక్షలు అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోయాలని ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేయడం ప్రారంభించగానే కాంగ్రెస్ పెద్దలు మళ్లీ అవే రాజకీయాలకు తెరతీశారు. సమీక్షలు, పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు పెడుతూ నిందారోపణలకే పరిమితమయ్యారు. గతంలో డిసెంబర్ 2027 నాటికి పూర్తిచేస్తామని ప్రకటించిన సర్కార్ ఇప్పుడు ఆ గడువును 2028కి పొడిగించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సైతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పదే పదే సందర్శిస్తున్నారు. గత నెలలో ఏకంగా రెండు రోజులపాటు పర్యటించారు. యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని రెండున్నరేండ్లుగా చెప్పడం తప్ప, కనీసం 2.5 కిలోమీటర్ల కాలువను పూర్తిచేయకపోవడం సర్కార్ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
సమీక్షలకే పరిమితం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు జిల్లాల వారీగా, ప్రాజెక్టులవారీగా సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారే తప్ప నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం పూర్తయిన సదర్మాట్ బరాజ్‌ను ప్రారంభించాలని ఏడాదిన్నర క్రితం నిర్ణయించారు. కానీ, ఇప్పటికీ ప్రారంభించలేదు. ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగమైన రాజీవ్ కెనాల్‌ను ప్రారంభించి హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్ పనులు ఒక్క అడుగు కూడా చేయలేదు. అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకసారి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎవరికివారే పలుమార్లు సమీక్షలు చేశారు. అమెరికా వెళ్లి కంపెనీ ప్రతినిధులతో చర్చించి పరికరాలను తెప్పిస్తున్నామని ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయకుండానే పనులను మొదలుపెట్టగా, ఆ వెంటనే సొరంగం కూలిపోయింది. ఏడాది తరువాత ఇటీవల సొరంగం పునరుద్ధరణ పనులు ప్రారంభించగా, అవి నత్తనడకనే కొనసాగుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టును సైతం పలుమార్లు ప్రభుత్వ పెద్దలు సందర్శించారు. గడువు ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువును మార్చారు. ప్రతి అంశంలోనూ హడావుడి తప్ప ఇరిగేషన్ శాఖలో సాధించిన ప్రగతి శూన్యం.
మరోవైపు లక్ష్యాల కుదింపు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పలు సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఏటా ఆరు లక్షల చొప్పున ఐదేండ్లలో 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ప్రగల్భాలు పలికింది. అందులో భాగంగా ఇప్పటికే 75% మేరకు పనులు పూర్తయిన మొత్తం 18 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. వాటిని ఏ, బీ క్యాటగిరీలుగా విభజించింది. వాటితోపాటు మిగిలిన ప్రాజెక్టులను కలిపి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 5.26 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. కానీ ఆచరణలో 50,111 ఎకరాలకు మాత్రమే నీటిని అందించినట్టు ప్రకటించింది. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ 4.95 లక్షల ఎకరాల ఆయకట్టును సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, తుదకు సాధించింది మాత్రం 50,413 ఎకరాలు మాత్రమే. నికరంగా గడచిన రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ 10.21 లక్షల ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుని, సాధించింది మాత్రం లక్ష ఎకరాలు (10%) మాత్రం కూడా మించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే మొత్తంగా ఐదేండ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రాబోయే మూడేండ్లలో కేవలం 15.26 లక్షల ఎకరాలకే నీరందిస్తామని ఇటీవల బడ్జెట్లో ప్రకటించింది. లక్ష్యాన్ని సగానికి కుదించుకోవడం కాంగ్రెస్ వైఫల్యానికి ప్రతీకగా నిలుస్తున్నది.
కరువు రాగానే మళ్లీ పరుగు
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణహితలో తప్ప మరెక్కడా వరద జాడ లేకుండా పోయింది. కన్నెపల్లి నుంచి నీళ్లను లిఫ్ట్ చేసుకుంటే అక్కడి నుంచి కొండపోచమ్మసాగర్ వరకు తరలించుకునే అవకాశమున్నది. పంపులు సిద్ధంగానే ఉన్నాయి.
నీటిని మళ్లించుకునేందుకు క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రవాహాలు సైతం అనుకూలంగానే ఉన్నాయి. ఇదే విషయాన్ని చెబుతూ నీళ్లను ఎత్తిపోయాలని బీఆర్ఎస్, తెలంగాణ నీటిరంగ నిపుణులు, విశ్రాంత ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం పునరుద్ధరించాకే బరాజ్‌లను వినియోగిస్తామంటూ వాదనలకు దిగుతున్నది. ప్రజల దృష్టి మరల్చేందుకు ఇప్పుడు మళ్లీ ప్రాజెక్టుల బాట పట్టింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పంపుల వెట్న్ నిర్వహణ ప్రారంభించింది. సీతమ్మసాగర్ పంపులు ప్రారంభించింది. దేవాదుల ఎత్తిపోతలు చేపట్టింది. వరుస పెట్టి మంత్రుల బృందం ఒక్కో ప్రాజెక్టును సందర్శిస్తుండడం, మళ్లీ ప్రణాళికలు ప్రకటిస్తుండటం మొదలు పెట్టింది.