స్పెషల్ టాస్క్ బ్యూరో/నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. కానీ, కొత్త ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందీ లేదు. పాతవి పూర్తిచేసిందీ లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక నిర్మాణాలను మధ్యలోనే వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మండల కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధాని దాకా ‘కేర్లెస్’ సర్కార్ కారణంగా వందల సంఖ్యలో నిర్మాణాలు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం పూర్తిచేసినవాటికి రిబ్బన్లు కట్ చేస్తూ.. క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు తండ్లాడుతున్న రేవంత్ సర్కార్.. అసంపూర్తి కట్టడాలను మాత్రం పూర్తిచేయడం లేదు.
రూ.40 కోట్లతో సిద్దిపేటలో నర్సింగ్ కళాశాల పనులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ కోసం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రూ.49 కోట్లతో పనులను చేపట్టింది. అయితే, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన ఆ కొద్ది పనులను పూర్తిచేయకపోవడంతో ప్రజలకు ఉల్లాసాన్ని ఇవ్వాల్సిన ట్యాంక్‌బండ్ ఉసూరుమంటున్నది.
ఖమ్మం నగర పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్లో బీసీ భవన నిర్మాణానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2 వేల గజాల స్థలంలో రూ.2 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. ప్రభుత్వం మారడంతో పనులు అసంపూర్తిగా మిగిలాయి.

కరీంనగర్ డ్యామ్ బైపాస్‌రోడ్డులో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం హరిత
హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను పక్కనబెట్టింది.

రూ. 4 కోట్ల వ్యయంతో ఖమ్మం నగరంలోని ఖానాపురం పరిధి ఇల్లెందు రోడ్డులో కేసీఆర్ ప్రభుత్వం వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణానికి పూనుకొన్నది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను గాలికొదిలేసింది.

పేదోడికి సొంతింటి కలను సాకారం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం కొత్తగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దాదాపుగా 80 శాతం పనులు పూర్తయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పూర్తిచేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది.

మహాకవి పోతన జన్మించిన జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో టూరిజం ప్యాకేజీలో భాగంగా పోతన స్మారక స్మృతి వనం పనులకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం మారడంతో పెండింగ్ బిల్లులు రావడం లేదని రెండేండ్లుగా కాంట్రాక్టర్ పనులు పూర్తిచేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి.

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని వెల్దుర్తి రూట్లో కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి పూనుకుంది. ఇందులో 252 ఇండ్లు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధ్దంగా ఉన్నాయి. 248 ఇండ్లు నిధుల లేమి కారణంగా వివిధ దశల్లో ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా పనులు పూర్తి చేయడం లేదు.
