హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పారిశుద్ధ్య నిర్వహణలో జలమండలి చిత్ర విచిత్రాలు చేస్తున్నది. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జలమండలి ఖజానాను ఖాళీ చేసేందుకు సరికొత్త విధానాలు అమలు చేస్తున్నది. ఏకంగా సీఎం కాన్వాయ్‌లో జెట్టింగ్ మిషన్లను ఏర్పాటు చేసి చరిత్రకెక్కింది. గతంలో ఎన్నడూ సీఎం కాన్వాయ్కి జెట్టింగ్ మిషన్లు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం సంచరించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో జెట్టింగ్ మిషన్లు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా రెండు ఏర్పాటుచేశారు. వీటి కోసం ఏడాదికి రూ.79,20,000 చెల్లిస్తున్నారు. రెండేండ్లుగా ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ జలమండలిలోని సంబంధిత సీజీఎం, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారికి అత్యంత సన్నిహితుడు అనే ప్రచారం జరుగుతున్నది.