న్యూఢిల్లీ : చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar)పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. సీఈసీ జ్ఞానేశ్పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని ఆ పిల్లో డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అక్రమ రీతిలో ఓట్లను డిలీట్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. సీఈసీ జ్ఞానేశ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తన బాధ్యతలను ఉల్లంఘించినట్లు పిల్లో ఆరోపించారు. ఓటర్ల రివిజన్ ప్రక్రియ కోసం అనేక నిర్ణయాలను తమ ఆమోదం లేకుండానే తీసుకున్నట్లు ఇద్దరు ఎన్నికల కమీషనర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే సీఈసీ జ్ఞానేశ్పై క్రిమినల్ దర్యాప్తు చేపట్టాలని అడ్వకేట్ శైలేంద్ర మని త్రిపాఠి పిల్ వేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఆయన ఆ పిల్ దాఖలు చేశారు. సీఈసీ తీసుకున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, సూచనలు, సాఫ్ట్వేర్ మార్పులను తక్షణమే రద్దు చేయాలని ఆ పిల్లో కోరారు. ఎన్నికల సంఘంలోని ఇతరు ఎన్నికల కమీషనర్ల ఆమోదం లేకుండా కుమార్ తీసుకున్న నిర్ణయాలను కొట్టివేయాలని పిల్లో డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియతో సంబంధం ఉన్న అంశాల్లో 14 సార్లు సీఈసీ జ్ఞానేశ్ను వ్యతిరేకించినట్లు ఎన్నికల కమీషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి ఆరోపించారు.
1950 నాటి ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను ప్రాసిక్యూట్ చేయాలని అడ్వకేట్ త్రిపాఠి తన పిల్లో సుప్రీంకోర్టును డిమాండ్ చేశారు.