హైదరాబాద్, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ): వెటర్నరీ యూనివర్సిటీలో నయా దందా మొదలైనట్టు తెలిసింది. పలువురు ప్రొఫెసర్లు రిటైర్మెంట్ వయస్సు పెంపు కోసం అడ్డదారి వెదుకుతున్నట్టు తెలిసింది. ఇందుకు యూనివర్సిటీకి చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. రిటైర్మెంట్ వయస్సును పెంపుదల చేయిస్తామంటూ వసూళ్ల కార్యక్రమానికి తెరలేపినట్టు తెలిసింది. క్యాటగిరీలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి, భారీ మొత్తంలో వసూలుకు రంగం సిద్ధంచేసినట్టు యూనివర్సిటీలో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వంలోని ఓ మాజీ సలహాదారు సహకారంతో పనిచేయిస్తామంటూ సదరు ప్రొఫెసర్లు చెప్తున్నట్టుగా తెలిసింది. గతంలో వ్యవసాయ యూనివర్సిటీలో కూడా ఇదే రకంగా ప్రొఫెసర్లు దందా మొదలుపెట్టగా, నాడు ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొనిరావడంతో స్పందించిన ప్రభుత్వం ఆ ఫైల్‌ను పక్కన పెట్టేసింది. లేదంటే నాడు రాత్రికి రాత్రే ఫైల్ ఆమోదం పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు వెటర్నరీ యూనివర్సిటీలో దందా మొదలుపెట్టడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఒకవైపు వెటర్నరీ విద్యను పూర్తిచేసుకున్న వేలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు లభించక రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వారికి అవకాశం కల్పించకుండా ఉన్నవారికే అవకాశం పొడగిస్తూ పోతే ఎలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రిటైర్మెంట్ వయస్సు పెంపు ఆలోచనను విరమించుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వెటర్నరీ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు రిటైర్మెంట్ వయస్సును 60 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ససేమిరా అంటున్నది. దీంతో ప్రొఫెసర్ల ఆశను అవకాశంగా మలుచుకున్న ఆరుగురు ప్రొఫెసర్లు భారీ వసూళ్లకు తెరలేపినట్టు తెలిసింది. రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి ప్రొఫెసర్లకు ఆశ కల్పించినట్టు సమాచారం. ఇప్పటికే సీఎంవోతోపాటు ఓ మాజీ సలహాదారునితో అన్నీ మాట్లాడేశామని, ఇక మనదే ఆలస్యమని, పైసలిస్తే పది, పదిహేను రోజుల్లోనే ఆర్డర్ తెప్పిస్తామని చెప్తున్నట్టు తెలిసింది. ఈ ఆరుగురిలో కొందరు ఇటీవల రిటైర్మెంట్ పొందినట్టు తెలిసింది. అయితే, పాత తేదీతో ఆర్డర్ తెచ్చుకొంటామనే భరోసాతో వారు కూడా ఇందులో భాగమైనట్టు తెలిసింది.
ఒకవేళ రిటైర్మెంట్ వయస్సు పెరిగితే పొందే లాభాన్ని బట్టి కూడా ఖర్చును లెక్కేసి వసూళ్లకు తెరలేపినట్టు తెలిసింది. క్యాటగిరీలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రేటును నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో సీనియర్ ప్రొఫెసర్లకు ఒక రేటు, ప్రొఫెసర్లకు మరొక రేటు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మరొక రేటును నిర్ణయించినట్టు తెలిసింది. ఇలా సీనియర్ ప్రొఫెసర్లకు, తొందరగా రిటైర్మెంట్ పొందే వారి నుంచి రూ.6 లక్షల చొప్పున, ప్రొఫెసర్ల నుంచి రూ.3 లక్షల చొప్పున, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి ఈ ఆరుగురు ప్రొఫెసర్లు మిగిలిన వారికి ఫోన్లు చేస్తున్నట్టు సమాచారం. ఇలా మొత్తం సుమారు 150 మంది వరకు ఉన్నట్టు తెలిసింది. సగటున ఒక్కొక్కరి నుంచి సగటున రూ.4 లక్షలు లెక్కేసినా.. మొత్తంగా కనీసంగా రూ.6 కోట్లు వసూలు చేసేందుకు పక్కా స్కెచ్ వేసినట్టు తెలిసింది.